(మార్కు 11:3 ఎవరైనను మీరెందుకు దీని విప్పు చున్నారని మిమ్మునడిగిన యెడల ఇది ప్రభువునకు కావలసియున్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను.)
రాజైన యేసు జయోత్సవముతో యేరుషలేము ప్రవేశం చేయుట మొదటి దినం ఆదివారం జరిగెను. యేసు యేరుషలేము లోనికి అనేక పర్యాయములు వచ్చెను. ఆయన ఈసారి యేరుషలేము ప్రవేశించుట కొరకు ఒక గాడిద పిల్లను కోరుకొంటున్నాడు. తన శిష్యులలో ఇద్దరిని పంపుతూ ఎదురుగా ఉన్న ఆ గ్రామానికి వెళ్ళండి. దానిలో ప్రవేశించగానే కట్టి ఉన్న గాడిదపిల్ల ఒకటి మీకు కనబడుతుంది. ఇదివరకు దానిమీద ఎవరూ ఎన్నడూ కూర్చోలేదు. దానిని విప్పి తోలుకురండి అని ఆయన వారితో అన్నాడు. మీరెందుకిలా చేస్తున్నారు?’ అని ఎవరైనా మీతో అంటే, ‘ఇది ప్రభువుకు కావాలి’ అనండి. వెంటనే అతడు దానిని ఇక్కడికి పంపిస్తాడని యేసు వారికి చెప్పాడు.
కట్టబడిన గాడిద ప్రభువుకు కావలసి యున్నది. అనేక రీతులుగా గాడిద మానవునికి సాదృశ్యంగా ఉన్నది. ఎందుకు గాడిదను ప్రభువు కోరుకుంటున్నాడు? ప్రభువు మానవుని యొక్క దీన స్థితిని చూచాడు అందుకనే ఆయన కోరుకున్నాడు.
దేవునికి కావలసిన ఈ గాడిద యొక్క స్థితి ఎలా ఉందొ ఒక్కసారి పరిశీలన చేద్దాం.
👉 1. గాడిద డెక్కలు చీలని జంతువు కనుక అపవిత్రమైనది. అదేవిధంగా మానవుడు పాపం చేసి దేవుని మహిమను పొందలేని స్థితిలో ఉన్నాడు. (రోమా 3:23 ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.)
👉 2. గాడిద ఇల్లు అరణ్యంగా కనబడుచున్నది మానవుడు లోకములో జీవించువాడుగా ఉన్నాడు. (యిర్మియా 2:24 అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు, యోబు 39:5-6 అడవిగాడిదను స్వేచ్ఛగా పోనిచ్చినవాడెవడు? అడవిగాడిద కట్లను విప్పినవాడెవడు? అరణ్యమును దానికి ఇల్లుగాను ఉప్పుపఱ్ఱను దానికి నివాసస్థలముగాను నియమించితిని.)
👉 3. ప్రభువు కోరుకున్న గాడిద సాధు చేయబడనిది. (మార్కు 11:2 దానిమీద ఏ మనుష్యుడును ఎప్పుడును కూర్చుండ లేదు)
గాడిద స్వభావం మొండిది అదేవిధంగా మానవుడు దేవునిమీద తిరుగుబాటు చేయువాడు దేవుని తిరస్కరించు వాడు.(యోబు 39:7 పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును తోలువాని కేకలను అది వినదు.)
👉 4. గాడిద మేత మేసేది పర్వత పంక్తిలో. అక్కడ కేవలం రాళ్ళు రప్పలు తప్ప ఏమియు దొరకదు. (యోబు 39:8 పర్వతముల పంక్తియే దానికి మేతభూమి) పాపియైన మానవుడు పచ్చిక బయలు లాంటి దేవుని సన్నిధి కాదని మేతకొరకు ఏమి దొరకని లోకములో తిరుగులాడువాడు.
👉 5. ఆ గాడిద కట్టబడిన స్థితిలో యున్నది. (మార్కు 11:2 మీ యెదుటనున్న గ్రామమునకు వెళ్లుడి; అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడియున్న యొక గాడిద పిల్ల కనబడును). మానవుడు అనేక సాతాను బంధకముల చేత కట్టబడి యున్నాడు. పాపపు కట్లు, రోగపు కట్లు, దయ్యపు కట్లు, దురలవాట్ల కట్లు మరణపు కట్లుచేత బంధింపబడి యున్నాడు. ప్రభువు ఆ కట్లు విప్పుటకు ఇష్ట పడుచున్నాడు.
👉 6. ఆ గాడిద రెండు దారులు కలియు చోట కట్టబడి యున్నట్లు KJV ఇంగ్లిష్ బైబిల్లో ఉన్నది. (Mark 11:4 the colt tied by the door without in a place where two ways met) ఈనాడు అనేకులు రెండు దారుల మధ్య కట్టబడి యున్నారు. కాసేపు లోకం కాసేపు ప్రార్ధన. అనగా నులివెచ్చని స్థితిలో మానవులు ఉన్నారు. (ప్రకటన 3:15 నీ క్రియలను నేనెరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు; నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు.)
👉 7. ప్రతి తొలి చూలు పిల్ల దేవునిది. కాని గాడిద యొక్క తొలిచూలు పిల్ల దేవునికి పనికిరానిది. అందునుబట్టి ప్రతి గాడిద తొలిచూలు పిల్లకు బదులుగా ఒక గొర్రె పిల్లను అర్పించిన గాడిద పిల్ల బ్రతుక గలదు. విడిపించే గొర్రెపిల్ల లేనిచో ఆ గాడిద పిల్ల మెడ విరగదీసి చంప బడవలసి యున్నది. (నిర్గ 13:13 ప్రతి గాడిద తొలి పిల్లను వెలయిచ్చి విడిపించి దానికి మారుగా గొఱ్ఱపిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించని యెడల దాని మెడను విరుగదీయ వలెను.)
ప్రతి మానవుడు కూడా తన పాపమును బట్టి మరణమునకు పాత్రుడు కాని మన స్థానంలో గొర్రెపిల్లగా ప్రభువు సిలువలో అర్పింపబడుట వలన మానవుడు మరణమునుండి తప్పింపబడినాడు. (యోహాను 1:29 ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱపిల్ల.)
అటువంటి భయంకరమైన స్థితిలో ఉన్న గాడిదను ప్రభువు కోరుకుంటున్నాడు.
అదే స్థితిలో ఉన్న మానవుడు ప్రభువునకు కావలసి వచ్చాడు. కారణం దేవుడు మానవుని ఎంతో ప్రేమించినాడు. తన శిష్యుల చేత ప్రభువు గాడిదను విడిపించినాడు. శిష్యులకు సాదృశ్యమైన దైవజనుల ద్వారా ఈనాడు అనేక నశించేపోయే ఆత్మలు విడిపించబడి ప్రభువు దగ్గరకు తీసుకొని రాబడుచున్నారు.
ప్రభువు ద్వారా ఎంపిక చేయబడి విడిపించబడి ప్రభువు దగ్గరకు తీసుకొని రాబడిన గాడిద జీవితం ఎంత అద్భుతంగా మారినదో గమనించండి.
✳ 1. విడిపించబడిన గాడిద ప్రభు సన్నిధికి తీసికొని రాబడినది: (మార్కు 11:7 వారు ఆ గాడిదపిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి...) అరణ్యంలోను ఉప్పు పర్రలలోను మురికి గుంటలలోను నివసించే గాడిదకు సకలాశీర్వాదములకు నిలయమైన దేవుని సన్నిధి దొరికినది.
పాపిగా ఉన్న మానవుడు విమోచింపబడగా దేవుని సన్నిధినికి తోడుకొని రాబడ్డాడు.
సమాధులలో సంకెళ్ళ మధ్య జీవించిన సేన దయ్యాలు పట్టినవాడు ప్రభువు ద్వారా విడుదల పొందుకొని ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడు. (లూకా 8:35 జనులు జరిగినదానిని చూడవెళ్లి, యేసునొద్దకు వచ్చి, దయ్యములు వదలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని, స్వస్థచిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండుట చూచి భయపడిరి.)
✳ 2. విడిపించబడిన గాడిద సాధు చేయబడనిది అయినా అది ప్రజలకు ప్రజల కేకలకు భయపడలేదు: (మార్కు 11:2 మీద దానిమీద ఏ మనుష్యుడును ఎప్పుడును కూర్చుండ లేదు)
మన ప్రభువు చేతిలో సాధకమున్నది. ఆయన చేతిలోనికి మన జీవితాలను అప్పగించుకొంటే మన భయమును, పిరికితనాన్ని, దిగులును తీసివేస్తాడు. నోటి మాంద్యం అనే భయముతో ఉన్న మోషే ప్రభువు చేతిలోనికి రాగా 32 లక్షల ఇశ్రాయేలీయులకు క్రీస్తు రాయబారిగా మారినాడు. ఫరోను ధైర్యంగా ఎదిరించి మాట్లాడాడు. గొప్ప ఘనమైన కార్యాలు ప్రభువు కొరకు చేసినాడు.
✳ 3. విడిపించబడిన గాడిదమీద వస్త్రములు వేయబడినవి: (మార్కు 11:7 వారు ఆ గాడిదపిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి, తమ బట్టలు దానిపై వేయగా...)
ప్రభువు యొద్దకు తీసుకొని రాబడిన గాడిద రకరకాల వస్త్రములతో అలంకరించ బడినది. అదేవిధంగా ప్రభువు యొద్దకు వచ్చిన వారికి దేవుడు అద్భుతమైన వస్త్రములను ఇస్తాడు. రక్షణ వస్త్రాలు, స్తుతి వస్త్రాలు, ఉల్లాస వస్త్రాలు, మహిమ వస్త్రాలు, నీతి వస్త్రాలు మొదలగు ధన్యకరమైన వస్త్రములు అనుగ్రహించబడును.
లోకంలోనుండి తిరిగి వచ్చిన చిన్న కుమారునికి ప్రశస్త వస్త్రం లభించినది. (లూకా 15:22 అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికికట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి)
✳ 4. విడిపించబడిన గాడిద వస్త్రముల మీద పచ్చని కొమ్మల మీద నడిచినది: ప్రజలు బట్టలు పచ్చని కొమ్మలు పరచినది ప్రభువు నడుచుటకు కాని ఆ బట్టల మీద విడిపించబడిన గాడిద నడుస్తూ ఉన్నది. ఆహా ఎంతో గొప్ప భాగ్యం ఆ గాడిదకు దొరికినది. (మార్కు 11:8 అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరచిరి..)
అరణ్యంలోను, ఉప్పు పర్రలలోను, మురికి గుంటలలోను నడిచే, ఈ గాడిదకు బట్టలు పరచిన మార్గంలో నడిచే భాగ్యం దొరికినది.)
ఆయన మార్గములు ఎంతో రమ్యములు. నీతి మార్గములలో నన్ను నడిపించు చున్నాడు. శాంతికరమైన జలములయొద్ద నన్ను నడిపించుచున్నాడు అని దావీదు దేవుని కొనియాడాడు.
✳ 5. విడిపించబడిన గాడిదకు ప్రభువుని మోసే భాగ్యం కలిగినది: (మార్కు 11:7 ఆయన దానిమీద కూర్చుండెను.)
దారుణమైన బరువులు మోసే గాడిద బ్రతుకు ఎంతో దుర్భరమైనది. దుర్వాసన కొట్టుచున్న మురికి బట్టల మూటలు మోయు గాడిదకు జీవాధిపతిని మోసే భాగ్యం కలిగినది. ప్రయాసతో కూడిన భారమైన జీవితం తొలగింపబడి తేలికైన యేసును మోసే భాగ్యం గాడిదకు కలిగినది. ఎన్నడూ సాధు చేయబడని ఆ గాడిద లోబడి అది ప్రభువు ఎటువెళ్ళమంటే అటు వెళ్ళింది. ఎంత ఆశ్చర్యం!
(మత్తయి11:28 ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును. 30 ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలిక గాను ఉన్నవి.)
✳ 6. మాట్లాడిన గాడిద: నోరులేని గాడిదకు ప్రభువు నోరు ఇచ్చి ప్రవక్తకు బుద్ధి చెప్పునట్లు చేసినాడు. బిలాము ప్రవక్త ధనాన్ని ఆశించి దేవుని ప్రజలను శపించుటకు వెళ్ళుచుండగా దేవుడు గాడిదకు నోరు ఇవ్వగా ప్రవక్తకు బుద్ధి వచ్చునట్లు గాడిద మాట్లాడినది. (సంఖ్యా 22:28 అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కు నిచ్చెను)
ఈనాడు కూడా దేవుడు అనామకులైన వారిని వెర్రివారిని పామరులను, బీదలను తృణీకరించ బడినవారిని వాడుకొనుచూ వారి నోరును వాడి గల ఖడ్గముగా చేయుచున్నాడు. (యెషయా 49:2 నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసియున్నాడు.)
✳ 7. న్యాయాధిపతి చేతిలోని గాడిద దవడ ఎముక వెయ్యిమందిని చంపగలిగెను: (న్యాయా 15:15 అతడు గాడిదయొక్క పచ్చి దవడ యెముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దానిచేత వెయ్యిమంది మనుష్యులను చంపెను.)
కుళ్లిపోయి వాసన వస్తున్న గాడిద కళేబరంలో ఏమి మిగలక పచ్చి దవడ ఎముక మాత్రం మిగిలినది. కాని అదే కుళ్ళిన గాడిద పచ్చి దవడ ఎముకను తన దివ్యమైన చేతిలోనికి తీసుకోవడానికి సంసోను ఏమాత్రం వెనుకాడలేదు. తన లోని అద్భుత శక్తిని ఆ ఎముకకు ఇవ్వగా అది వెయ్యిమంది శత్రువులను చంపగలిగినది.
ప్రియమైన దేవుని బిడ్డా! నీ జీవితంలో ఏమి మిగలలేదని బాధ పడుచున్నావా? ఇప్పటికైనా మిగిలిన జీవితాన్ని ప్రభువుకు అప్పగిస్తే, బలాఢ్యుడైన ప్రభువు నిన్ను తన చేతిలోనికి తీసుకొని నీ ద్వారా అద్భుత కార్యములు జరిగించగలడు.
ముగింపు: ఈదినాలలో అనేకులు లోకంలోనే తిరుగుచున్నారు గాని ప్రభువును ఎరుగకున్నారు. గాడిద తన సొంతవాని దొడ్డి తెలుసుకొనును కాని నా ప్రజలు యోచింపరని ప్రభువు ఎంతో వేదన చెందుచున్నాడు. (యెషయా 1:3 ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంతవాని దొడ్డి తెలిసికొనును ఇశ్రాయేలుకు తెలివిలేదు నాజనులు యోచింపరు)
ప్రియమైన దేవుని బిడ్డలారా! యేసు ఒక అపవిత్రమైన గాడిద విషయంలో ఒక అద్భుత ప్రణాళిక కలిగి ఉన్నాడు అంటే ఇక మన అందరి జీవితాల విషయమై ఆయన ఇంకా ఎంత గొప్ప ప్రణాళికలు ఇచ్చుటకు ప్రభువు సిద్ధంగా ఉన్నాడో ఒక్కసారి ఆలోచిద్దాం. (యిర్మియా 29:11)
పరమ రక్షకుని అందరికి కనబడే విధంగా మోసిన గాడిద జీవితం ఎంత ధన్యకరం. తన జీవితం ద్వారా రాజుల రాజుకు రాయల్ సర్వీస్ చేసి ప్రభువుకు ఎంతో మహిమను ఆ గాడిద కలిగించింది.
ప్రభువుకు ఆ గాడిద కావలసియున్నట్లుగా మన జీవితాలు కూడా ప్రభువుకు కావాలి. ఒక అపవిత్రమైన మరణకరమైన స్థితిలో ఉన్న ఎన్నికలేని హీనమైన గాడిదను ప్రభువు ఎన్నుకొని దాని జీవితాన్ని అద్భుతంగా విమోచించి ఆ గాడిద ద్వారా ఎంతో ఘనమైన కార్యాలు చేయించాడు. మరి అటువంటి గాడిద కంటే వేయిరెట్లు శ్రేష్టమైన మనం దేవుని దగ్గరకు వస్తే మన జీవితాలను ప్రభువు ఇంకా ఎంతో ఘనంగాను ప్రయోజనకరంగా వాడుకొనగలడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అటువంటి గొప్ప ధన్యకరమైన జీవితం ప్రభువు మనకు కూడా దయచేసి దీవించునుగాక!! ఆమెన్!!
దైవాశ్శీసులు!!!
0 comments