>>
..:: సర్వభూజనులారా , యోహోవాను బట్టి ఉత్సహించుడి , ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి - కీర్తన 98:4 ::..
యూదా ద్వారా కూడా అద్భుతాలు, కాని....✍

(యూదా ఇస్కారియోతు – 4వ భాగం)

ప్రియ మిత్రులందరికి శుభ వందనాలు!

 మార్కు  3:14-15
వారు తనతో కూడ ఉండునట్లును దయ్యములను వెళ్లగొట్టు అధికారముగలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన పండ్రెండు మందిని నియమించెను.

ఎ. అనుసరించిన యూదా:
యేసు యూదాను తన శిష్యునిగా పిలిచినప్పుడు అతడు ఇష్టపూర్వకంగానే ప్రభువును అనుసరించాడు. కారణమేమంటే యేసు రోమియుల నుండి ఇశ్రాయేలుకు విడుదలను ఇస్తాడాని  యూదా నమ్మాడు. అతను ఒక రక్షకుడిని అనుసరించలేదు;
యూదా యేసుని ఒక విప్లవాత్మక వ్యక్తిగా మాత్రమే చూశాడు.

బి. అభిషేకించబడిన యూదా:
 ఆయన యూదాని మిగతా శిష్యుల మాదిరిగానే దయ్యములను వెళ్లగొట్టు అధికారముగలవారై సువార్త ప్రకటించుటకును అభిషేకించాడు.

“అధికారం గలవారై” అను మాటలో మనం గమనించవలసిన విషయం ఏమంటే, వారిని యేసు అభిషేకించుటకు ముందుగా వారు శిక్షణ పొందుకున్నారని మనం భావించవలసి  యున్నది. యేసు పన్నెండుగురిని తీసుకొని, తాను చేయబోయే పరిచర్య కొరకు వారిని పంపించటానికి సిద్ద పరచాడు మరియు వారిని ఒక ప్రత్యేక ప్రయోజనం ఈలోకం నుండి వేరు చేశాడు.

యూదా మూడు సంవత్సరాల పాటు యేసుతో జీవించి ప్రభువును నమ్మకపోవడం ఆశ్చర్యంగా ఉందని కొందరు అంటూ ఉంటారు. అయినా, మనచుట్టూ జరుగుతున్న పరిస్థితులు ఇదే విషయాన్ని మనకు రుజువు చేస్తున్నాయి. ఎన్నో సంవత్సారాలు ప్రజలు దేవుని వాక్యము సంఘాల్లో వింటున్నారు, ప్రార్ధనలు చేస్తున్నారు కాని చాల మంది వారి వారి పాపాలలోనే చని పోతున్నారు గాని బాప్త్మీసం తీసుకోవడంలేదు. ఇది ఎంతో విచారకరమైన విషయం. 

సి. అద్భుతాలు చేసిన యూదా:
 శిష్యులందరితో బాటు యూదా కూడా దయ్యాలను వదల గొట్టాడు, కుంటివారికి నడకను చూపులేని వారికి చూపును, చెవిటివారికి వినికిడిని కలిగించాడు. శిష్యులందరితో బాటు యూదా చేసిన సువార్త ప్రకటనకు అనేక మంది పాపులు యేసును విశ్వాసముంచారు అని వ్రాయబడినది.

అందరితో బాటు యూదా కూడా సువార్తను అధికారంతో ప్రకటించాడు. అద్బుతాలు చేశాడు, అనేకులు తన బోధల ద్వారా రక్షించ బడటం చూశాడు. వేరొక మాటలో చెప్పాలంటే, ప్రభువు కొరకు యూదా చేసిన పరిచర్య ఇతర శిష్యుల పరిచర్య కంటే ఏమాత్రం తక్కువకాదు, ఏమాత్రం వేరు చేయలేము.. వాస్తవంగా ఇది ఒప్పుకోవలసిన విషయం.

కాని యూదా శిష్యుల మధ్య ఎలా ఉన్నాడంటే, గోధుమల మధ్య గురుగుగా ఉన్నాడు. ఇది ఒక్క యేసుకు మరియు యూదాకు మాత్రమే తెలిసిన విషయం. నేటి దినాలలో కూడా అనేక మంది ఈ స్థితిలోనే ఉన్నారు.
పరిచర్యలు అధ్బుతాలు చేసే ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు.
 పరలోకంలో ఉన్న తండ్రి ఇష్టప్రకారం చేసేవారే ప్రవేశిస్తారు. దేవుని పేరు మీద గొప్ప కార్యాలు అధ్బుతాలు, గొప్ప పరిచర్యలు చేస్తున్నారు కాని వారి యొక్క వాస్తవ పరిస్థితి యూదా ఇస్కారియోతు మాదిరిగా ఉన్నది.

తీర్పు దినాన యూదా ఉన్న స్థితిలో చాలామంది దేవుని ఎదుర్కుంటారని యేసు మనతో చెప్పుచున్నాడు,

మత్త. 7: 21-23.
 ప్రభువా. ప్రభువా,అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును ఆ దినమందు అనేకులు నన్ను చూచిప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున  దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు  చేయలేదా?  అని  చెప్పుదురు.  అప్పుడు మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయు వారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును.

తాము సత్యాన్ని ఉపదేశిస్తున్నామని వారనుకోవచ్చు గానీ వారికి సత్యం తెలియదు. తాము గొప్ప గొప్ప బోధకులుగా ప్రవక్తలుగా ప్రకటించడం, అద్భుతాలు చెయ్యడం అనేవి తాము దేవుని రాజ్యంలో ఉన్నాం అనేందుకు రుజువులు అనుకుంటారు. అసలు సంగతి “ఆ రోజున” – అంటే దేవుని తీర్పు రోజున వారికి తెలుస్తుంది.

గొప్ప ప్రసంగాలు చేసే సామర్థ్యత పరిశుద్ధతకు గుర్తు కాదు, అద్భుతాలు చెయ్యగలగడం పాపవిముక్తికి సూచన కాదు. గొప్ప బోధకునిగా ఉండడం, దేవుని రక్షణ సందేశాలు మనుషులకు అందించడం, అద్భుతాలు చెయ్యడం ఇవన్నీ కూడా దేవుని నిజమైన సేవకులు కానివారికి సాధ్యమేనా? సాధ్యమే. యూదా ఇస్కరియోతు దొంగ, సాతాను వంటివాడు. అయితే ఇవన్నీ చేయడానికి ఇతర శిష్యులలాగే అతడికీ అధికారం లభించింది.

ఉదాహరణకు తీసుకొంటే బిలాము మంచి సత్యాన్నే దేవుని మూలంగా పలికాడు గాని అతడు చెడ్డవాడుగా ఉండి దేవుని తీర్పును పొందుకున్నాడు (సంఖ్యా 22:1-7; 2 పేతురు 2:15 తిన్ననిమార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమునుబట్టి త్రోవ తప్పిపోయిరి.)

అదేవిధంగా యేసు కాలంనాటి ప్రధాన యాజకుడు ప్రవచనాలు కూడా చెప్పాడు.  (యోహాను 11:49, 52 అయితే వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైయుండిమీ కేమియు తెలియదు. యేసు ఆ జనము కొరకును, ఆ జనము కొరకు మాత్రమేగాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును, చావనైయున్నాడని ప్రవచించెను.)

వీళ్ళు చేస్తున్నది అక్రమమని ప్రభువుకు తెలుసు కాని ఆయన అంత్య దినం వరకు వారి గురించి ఓపిక పట్టాడు. తనను “ప్రభూ” అని పిలుస్తూ, తన పేరట అద్భుతాలు చేస్తూ కూడా పాపవిముక్తి, రక్షణ లేకుండా ఉండడం సాధ్యమేనని ఆయనకు బాగా తెలుసు. యేసు వారితో “ఒకప్పుడు మీరు నాకు తెలుసు గానీ ఇప్పుడు మీరెవరో నాకు తెలియదు” అనలేదు, చూడండి.
 “మీరు ఎన్నడూ నేను ఎరిగినవారు కాదు” అన్నాడు. ఈ ప్రవక్తలు అసలు ఆయనవారు కానే కాదు (యోహాను 10:14,27), దేవుని పిల్లలు ఎప్పుడూ కాదు. యేసు వారిని “అక్రమకారులారా” అంటున్నాడు.

వారు చేసిన శ్రేష్ఠమైన పనులు కూడా చెడు ఉద్దేశాలతో చేశారు. వాటన్నిటికీ మూలం స్వార్థం. స్వార్థం దుర్మార్గం కాబట్టి వారి పనులు కూడా దుర్మార్గమే. తమకోసమే పనులు చేసేవారు చివరికి తమకు మిగిలినది తామే అని తెలుసుకుంటారు. వారి స్వార్థమే వారికి మిగులుతుంది, క్రీస్తు కాదు, దేవుడు కాదు, రక్షణ కాదు. “నా దగ్గరనుంచి పొండి” అనే మాటల్లో భయంకరమైన అంతం కనిపిస్తున్నది.  ఇది తమ జీవితాల్లో వారే కోరుకున్నది  కాబట్టి వారికి లభించేది ఇదే. ఈ శిక్ష వారికి రావడం న్యాయమే.  తీర్పు తరువాత ఎవరి స్థితినీ మార్చడం అనేది ఉండదు.  –

(మత్తయి 25:46 వీరు నిత్యశిక్షకును నీతిమంతులు నిత్యజీవమునకును పోవుదురు.; 2 తెస్స 1:8-10 మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమపొందుచున్న మీకు మాతోకూడ విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధులయందు మహిమపరచబడుటకును, విశ్వసించినవారందరి యందు ప్రశంసింపబడుటకును,ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండియు ఆయన ప్రభావమందలి మహిమ నుండియు పారదోలబడి, నిత్యనాశనమను దండన పొందుదురు.)

యూదా ఇస్కారియోతును గూర్చిన మరికొన్ని విషయాలు తదుపరి పాటాలలో నేర్చుకొందాం. (To be continued)

దైవాశ్శీసులు!!!


Pastor Jyothi Benjamin
(Soli Deo Gloria)

Immanuel Bible College
NIDUBROLU

0 comments

Post a Comment

Total Pageviews

Email Subscriptions

Enter your email address:

Delivered by FeedBurner

Chrstian Lybrary APK Downlad

Chrstian Lybrary APK Downlad
Mobile APK Downlad Telugu E-Books Telugu Bible study Telugu Christian Songs Lyrics Telugu Christian Messages Telugu Christian Songs Mp3 TELUGU CHRISTIAN VIDEO SONG Bible pdf Bible Quotes, Bible study Bible Verses Christmas Wallpaper English Bible .Pdf English Bible mobile jar files Free Jesus Christ wallpapers Jesus Christ pictures