బైబిల్ లో ఉన్న కపటోపాయములు
1. *హేబేలుకు వ్యతిరేకముగా కయీను యొక్క కపటోపాయము* - కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడుతున్నట్లు మభ్యపెట్టి పొలములో అతని మీద పడి అసూయతో అతనిని చంపెను - *ఆది 4:8*
2. *యాకోబు మరియు ఏశావులకు వ్యతిరేకముగా ఇస్సాకు మరియు రిబ్కాల కపటోపాయము* - తండ్రియైన ఇస్సాకు యొక్క ఆశీర్వాదములు పొందుటకు యాకోబే ఏశావు అని అతనిని మోసగించిరి - *ఆది 27 అధ్యాయం*
3. *షేకెమునకు వ్యతిరేకంగా షిమ్యోను మరియు లేవీల కపటోపాయము* - తమ సహోదరియైన దీనాను షేకెము చెరచినందున వీరు ప్రతీకారం తీర్చుకొనుటకు పొంచి ఉండి, షేకెమును అతని గోత్రపు వారును సున్నతి చేసుకోనుడి అని మభ్యపెట్టి వారు సున్నతి పొందిన తర్వాత ఎవరికీ తెలియకుండా ఊరిమీద పడి షేకెమును, అతని తండ్రిని మరియు అతని గోత్రపు ప్రతి పురుషుని చంపిరి - *ఆది 34 అధ్యాయం*
4. *యోసేపునకు వ్యతిరేకముగా అతని సహోదరుల యొక్క కపటోపాయము* - వీరు తమ తమ్ముడైన యోసేపుపై అసూయతో అతనిని ఐగుప్తు బానిసత్వమునకు అమ్మివేసి, క్రూరమృగము యోసేపును తినివేసినదని తమ తండ్రికి అబద్ధము చెప్పిరి - *ఆది 37:12-36*
5. *యూదాకు వ్యతిరేకముగా తామారు యొక్క కపటోపాయము* - ఈమె సహజమైన వేశ్యవలె యూదాను ప్రలోభ పెట్టి అతని ద్వారా గర్భవతి అగుటకు అతనిని తన గుడారమునకు తీసుకునిపోయెను - *ఆది 38 అధ్యాయం*
6. *యోసేపునకు వ్యతిరేకముగా పోతీఫరు భార్య యొక్క కపటోపాయము* - తనతో శయనించుటకు యోసేపు నిరాకరించినందున, యోసేపే తనను బలవంతముగా చెరుచుటకు ప్రయత్నించాడని అబద్ధం చెప్పెను - *ఆది 39:13-19*
7. *మోషేకు వ్యతిరేకముగా కోరాహు యొక్క కపటోపాయము* - ఇతడు మోషేవలే ఇశ్రాయేలీయులపై అత్యున్నత స్థానము పొందవలెనని దురాలోచనతో మోషేను వ్యతిరేకించెను - *సంఖ్యా 16:1-3*
8. *యెహోషువాకు వ్యతిరేకముగా గిబియోనీయుల యొక్క కపటోపాయము* - వీరు దురాలోచనతో రాయబారులమని మారువేషంతో మభ్యపెట్టుటకు తమ గాడిదలకు పాత గోనెలు కట్టి, పాతగిలి చినిగి కుట్టబడియున్న ద్రాక్షరసం సిద్దెలు తీసుకొని, పాదములకు మాసికలు వేయబడిన చెప్పులు తొడుక్కుని, పాత బట్టలు కట్టుకుని వచ్చిరి - *యేహో 9 అధ్యాయం*
9. *సంసోనుకు వ్యతిరేకముగా దెలీలా యొక్క కపటోపాయము* - సంసోను యొక్క గొప్ప శక్తికి మరియు బలమునకు గల రహస్య కారణమును తనకు చెప్పి తన యెడల అతనికి గల ప్రేమను నిరూపించుకొనమని సంసోనును బలవంతము చేసినది. ఈ కార్య సాధనములో ఆమె సఫలీకృతురాలై అతనిని ఫిలిష్తీయులకు అప్పగించినది - *న్యాయ 16:4-20*
ఈ విలువైన వర్తమానాన్ని మీ మిత్రులకు షేర్ చేసి మీవంతు దేవుని పని చేయండి.
0 comments