ఇంతగా హెచ్చించుటకు నేనేపాటి వాడను..... ?
గొర్రెల వెంబడి తిరుగుతున్న దావీదును, గొర్రెల దొడ్డె లో నుండి తీసి, ఇశ్రాయేలీయులకు రాజును చేశారు దేవుడు. అతడు తరుమబడుతున్నప్పుడు దేవుని కృప ఆయనను వెంటాడింది. అతడు వెళ్ళినచోటనేల్లా దేవుడు అతనికి తోడుగా నున్నారు. దేవుడే శత్రువులను నిర్మూలము చేసి, లోకంలో గొప్ప ఘనతను ఆయనకిచ్చారు.
దేవదారు మ్రానులతో కట్టబడిన భవనం లో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న దావీదు రాజుకు, దేవుని మందసం గుడారములో ఉండడం హృదయాన్ని కలచివేసింది. తన హృదయవాంఛను ప్రవక్తయైన నాతాను గారితో పంచుకున్నారు. నీ హృదయంలో ఏముందో దానిని చెయ్యి. దేవుడు నీకు తోడుగా ఉంటారని చెప్పారు. కానీ, దేవుడు దానికి సమ్మతించలేదు. దావీదు చేతులు రక్తాన్ని ఒలికించాయి, అతడు నా మందిరాన్ని కట్టకూడదు. “నీ జీవిత దినములు తీరి నీ పితరులయొద్దకు నీవు చేరునప్పుడు నీ కుమారులవలన కలుగు నీ సంతతిని నేను స్థాపనచేసి అతని రాజ్యమును స్థిరపరచెదను. అతడు నాకు ఒక మందిరమును కట్టించును, అతని సింహాసనమును నేను నిత్యస్థాపన చేసెదను. నేను అతనికి తండ్రినైయుందును, అతడు నాకు కుమారుడై యుండును; నీకంటె ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. నా మందిరమందును నారాజ్యమందును నేను నిత్యము అతని స్థిరపరచెదను, అతని సింహాసనము ఎన్నటికిని స్థిరముగా నుండునని అతనికి తెలియజేయుము”. (1దిన 17:11-14) అని, నాతాను ద్వారా, దావీదుకు తెలియజేసినప్పుడు, అతని హృదయమంతా కృతజ్ఞతతో నిండిపోయినప్పుడు, దేవుని సన్నిధిలో చేరి అతడు చేస్తున్న ప్రార్ధన.
నీవు నన్ను ఇంత హెచ్చు లోనికి తెచ్చుటకు నేను ఎంతటివాడను? (1 దిన 17:16) ప్రభువా నాకున్న అర్హతేమిటి? గొర్రెల దొడ్డె లో జీవితాన్ని గడపాల్సిన నాకు సింహాసనమిచ్చావు. అంతే కాకుండా ఆ సింహాసనాన్ని నా సంతానానికి కూడా నిత్యస్థాపన చేస్తున్నావా? నేనెంతటి వాడను ప్రభువా? అంటూ తన పూర్వ స్థితిని జ్ఞాపకం చేసుకొంటూ, ప్రస్తుత పరిస్థితిని భేరీజు వేసుకొంటూ, పొందబోవు నిత్యమైన వాగ్ధానాన్ని నెమరువేసుకొంటూ, కృతజ్ఞతతో నిండిన హృదయంతో తనను తాను తగ్గించుకొంటూ, దేవునిని హెచ్చించగలుగుతున్నారు.
నీ పూర్వ స్థితిని, ప్రస్తుత పరిస్థితితో నీవెప్పుడైనా సరిపోల్చుకున్నావా? పెంటకుప్పల మీద జీవించాల్సిన నిన్నూ నన్నూ మింటపైన ఘనులతో కూర్చుండబెట్టారాయన. తినడానికి తిండిలేక, ధరించడానికి వస్త్రాలు లేక, నివసించడానికి సరియైన గృహాలు లేక, ఎండకు ఎండుతూ, చలికి వణకుతూ, వర్షానికి తడుస్తూ అన్నట్లు మన పితరులు జీవించిన జీవన పరిస్థితులు, మనము ఏ కోశానా చవిచూడలేదు. పస్తు అంటే ఏమిటో మన బిడ్డలకు తెలియనే తెలియదు. ఇంతగా ప్రభువు నిన్ను హెచ్చిస్తే? ఎప్పుడైనా, ప్రభువా ఇంతగా హెచ్చించడానికి నేను ఏపాటివాడను? అంటూ కృతజ్ఞతతో ఒక్కమాట చెప్పగలిగావా? ఇంతవరకూ మనము భౌతిక సంబంధమైన విషయాలను గూర్చే మాట్లాడుతూ వస్తున్నాము. అంతకుమించి, ఆయన నిన్ను ఎంతగా హెచ్చించారంటే? నిత్యమరణమే మనకు శరణ్యమైనప్పుడు, మనలను హెచ్చించడానికి, దాసునిగా దిగివచ్చి, మనము పొందాల్సిన శిక్షను మనకు బదులుగా ఆయనే అనుభవించి, మనలను విమోచించి, ఆయన కుమారునిగా, కుమార్తెగా మనలను హెచ్చించారు. ప్రభువా! నా కోసం ఇంత చెయ్యడానికి, ఇంతగా నను హెచ్చించడానికి నేనేపాటి వాడను? నేనేపాటి దానను? అంటూ ఎప్పుడైనా కృజ్ఞతతో ఈమాట చెప్పగలిగావా? ఆయన ఎంతగా మనలను హెచ్చించారో మనలోనికి మనము చూడగలిగితే, ఆ మాట చెప్పకుండా ఉండలేము. ఆయన ప్రేమను, కృపను అర్ధం చేసుకొంటూ కృతజ్ఞత కలిగిన జీవితాన్ని జీవించడానికి మన జీవితాలను సిద్ధపరచుకొందము. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
By
0 comments