మద్యపానం - ధూమపానము
ఎవరికి శ్రమ? ఎవరికి దుఃఖము? ఎవరికి జగడములు? ఎవరికి హేతువులేని గాయములు? ద్రాక్షరసంతో ప్రొద్దుపుచ్చు వారికే కదా! . . . పిమ్మట అది సర్పమువలె కరచును. కట్లపాము వలె కాటువేయును. విపరీతమైనవి నీ కన్నులకు కనబడును. వెర్రిమాటలు పలుకుదువు. (సామెతలు 23:29-35).
ప్రియ సహోదరి/సహోదరుడా! నేటి దినాలలో త్రాగుడు మరియు ధూమపానం ఎక్కువైపోయింది. ముఖ్యంగా యవ్వనస్తులు చాలా ఘోరంగా వీటికి బానిసైపోయారు. త్రాగి వాహనాలు నడపడం, యాక్సిడెంటులు అవ్వడం జరుగుతుంది. పట్టణాలలో, ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీల్లో యువకులుతో పోటీగా యువతులు కూడా మద్యపానం ధూమపానం చేస్తున్నారు, సాతానుకి బానిసైపోతున్నారు. అయితే విచారం ఏమిటంటే అన్యులతో పాటు దేవుని బిడ్డలు కూడా అదే పాపం చేస్తున్నారు సరికదా ప్రభురాత్రి సంస్కారం కూడా తీసుకొంటున్నారు. దేవుడంటే భయం లేకుండా జీవిస్తున్నారు. ఇప్పుడు నేను వ్రాసేది దేవుని బిడ్డలు కోసమే. ఎదుట వారికి తీర్పు తీర్చడం నాకేల? పౌలుగారు అంటున్నారు " ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడెవడైననూ- తిట్టుబోతుగాని, త్రాగుబోతుగాని. . . అయితే అట్టివానితో సాంగత్యము చేయరాదు, కలసి భుజింపరాదు. . . సంఘంలో నుండి వెలివేయమని చెబుతున్నారు (1కొరింథీ 5:11-13). ఎందుకంటే అది దేవునికి అసహ్యమైన క్రియ. మోసపోకుడి! జారులైననూ. . . త్రాగుబోతులైననూ, దూషకులైననూ. . దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు (1కొరింథీ 6:9,10).
నేటి దినాలలో క్రైస్తవ జనాంగము దీనిని మరచిపోతున్నారు. లోకస్తులతో కలసి లోకస్తులు త్రాగుతున్నట్లు త్రాగుతున్నారు. దానివలన ఏమేమి సంభవిస్తాయో సొలొమోనుగారు వివరించారు. మొదటగా శ్రమ. తన దేహాన్ని తనే శ్రమ పెట్టుకొంటున్నాడు. తమ కుటుంబాన్ని కూడా శ్రమపెడుతున్నారు. దానివలన దుఃఖము అశాంతి, కారణం లేని జగడాలు, ఎందుకంటే త్రాగేసి ఏం మాట్లాడుతారో వారికే తెలియదు. ఫుల్ గా త్రాగేసి రోడ్డుమీద పడిపోతారు, పందిలా బురదలో , డ్రైనేజీలో దొర్లుతుంటారు. ఫలితంగా హేతువులేని గాయాలు.
గమనించండి అన్యులుకూడా ఇలా చేస్తారు కాని ఎవరూ పట్టించుకోరు, అదే దేవుని బిడ్డలు చేస్తే పెద్దరాధ్ధాంతం చేస్తారు దేవుని బిడ్డలు రోడ్డుమీద దొర్లుతున్నారు అంటారు. తద్వారా దేవుని నామం అవమానపరచడుతుంది దూషింపబడుతుంది.
ఇంకా ఏమి వస్తాయి? Sugar, BP, Lever పనిచేయదు, ధూమపానం వలన ఊపిరితిత్తుల పాడైపోతాయి, కేన్సర్ ఇంకా అనేక రోగాలు - పిమ్మట అది సర్పము వలె కరచును అంటే ఇదే. కట్లపాము కాటేస్తే వెంటనే చనిపోరు, పక్షవాతము, ధీర్ఘకాలిక రోగాలు వస్తాయి. ఈ మద్యపానం, ధూమపానం వల్ల కూడా అలాగే ధీర్ఘకాలిక రోగాలు వస్తాయి.
ప్రియ సహోదరుడా! దేవుని పరువు తీస్తున్నావు, నీ ఆరోగ్యం పాడుచేసుకొంటున్నావు. నీ కుటుంబాన్ని కూడా బాధపెడుతున్నావ్. త్రాగుబోతులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని తెలుసుకో!
కొందరంటారు త్రాగకూడదని బైబిలులో ఎక్కడుంది? వారు బైబిల్ చదివితేనే కదా తెలుస్తుంది ఎక్కడ వ్రాయబడిందో తెలుస్తాది. 1కొరింథీ 5:10-13; 6:9,10; 1 పేతురు 4:3; సామెతలు 23:29-35.
ఇంకొందరు అంటారు మరి పౌలుగారు తిమోతిగారికి పత్రిక వ్రాస్తూ నీ కడుపు నొప్పి కోసం ద్రాక్షారసం తీసుకోమని వ్రాశారు కదా అని. ప్రియబిడ్డా! దైవ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలి, కలిపి చెరపకూడదు. నీకు అనుకూలంగా మలచుకోకూడదు.
1. ఇక్కడ ద్రాక్షారసం (wine) అంటే ద్రాక్షపళ్ళునుండి తీసిన రసం డైరెక్టుగా త్రాగమని అర్థం. దానికి ఈస్ట్ కలిపి, పులియబెట్టిన తర్వాత త్రాగమనికాదు. ప్రస్తుతం చాలామంది (RCM) చేస్తున్న పని ఇదే. బైబిల్ కు వ్యతిరేకంగా చేస్తున్నారు.
2. పూర్వకాలంలో Medicine అభివృద్ధికాని రోజులలో యూరోప్, మధ్య ఆసియా ప్రాంతాలలో ఏదైనా అనారోగ్యం కలిగితే ద్రాక్షరసం, అంజూరపు ఆకులు, ఒలీవ ఆకులు, ఒలీవ నూనె వాడేవారు. (మన దేశంలో నల్లమందు వాడినట్లు 50 సం. ల క్రితం) . ద్రాక్షరసంతో గాయాలు కడిగితే తొందరగా నయమయ్యేది (wine తో కాదు). ఆ ద్రాక్షారసం త్రాగితే కడుపు నొప్పి లాంటివి తగ్గేవి. ఆ ఉద్దేశంతోనే పౌలుగారు చెప్పారు గాని ఈస్ట్ కలిపిన wine త్రాగమని చెప్పలేదు.
ధూమపానం
కొంతమంది సిగరెట్లు త్రాగకూడదు అని బైబిలులో లేదుకదా, త్రాగితే తప్పేంటి అని అడుగుతారు. బైబిలు వ్రాయబడినప్పుడు సిగరెట్లు బీడీలు లేవు ఉంటే వ్రాయబడి ఉండేది. ఒకవేళ దేవుడు ధూమపానాన్ని అనుమతిస్తే నీ తలమీద గాని, మరో ప్రాంతంలో ఒక పొగ గొట్టాన్ని (exhaust pipe) పెట్టి ఉండేవారు కదా! గాలి పీల్చుకోడానికి ముక్కు రంధ్రాలు, మలమూత్ర విసర్జనకు మరో రంధ్రాలును ఏర్పాటుచేసినట్లు. ఎంత ఘోరమంటే ఆ సిగరెట్ పేకట్ మీద ప్రొగత్రాగడం హానికరం అని వ్రాసినా డబ్బు పెట్టి కొని, అగ్గి పెట్టి కాల్చేస్తున్నావు. కొంత కాలానికి అవి నీ ఊపిరితిత్తులను తినేస్తాయి. మరికొందరు మాధక ద్రవ్యాల మత్తులో మూలుగు తున్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లలను మంచి కాలేజీలలో అడ్మిట్ చేస్తున్నారు తర్వాత వారు ఎలా ప్రవర్తిస్తున్నారో పట్టించుకోవడం లేదు. మరీ ముఖ్యంగా వాళ్ళకోసం మోకాళ్ళ మీద కన్నీటితో దేవునికి ప్రార్థన చెయ్యడం లేదు.ఫలితంగా సాతాను మీ పిల్లలను ఈ లోకాశలమీదకు మళ్ళించి నాశనానికి తీసుకొని పోతున్నాడు.
ఇక పేతురుగారు అంటున్నారు మద్యపానం గాని, త్రాగుబోతుల విందులు గాని చేయగూడదు అని (1 పేతురు 4:3). పౌలుగారు అంటున్నారు త్రాగుబోతులు పరలోకం వెళ్లరని (1 కొరింథీ 6:9,10). యెషయా గ్రంథంలో త్రాగుబోతులకు శ్రమ అంటున్నారు (యెషయా 28:1).
అందుకే యోవేలు గ్రంథంలో దేవుడంటున్నారు "మత్తులారా! మేలుకొని కన్నీరు విడువండి, ద్రాక్షరస పానం చేయువారలారా! రోదనం చేయుడి" (యోవేలు 1:5)
కాబట్టి నేడే నీ మత్తు, మద్యపానం, ధూమపానం, మాదకద్రవ్యాలు వదలి యేసయ్య పాదాలు దగ్గరకు రా! మానేద్దామని అనుకొంటున్నా మానలేక పోతున్నావా? నీ సిగరెట్ పేకట్లు, మందు బాటిల్లు బయట పారవేసి యేసయ్య పాదాలను నీ కన్నీటితో కడుగు. వెంటనే నీకు దేవుడు వాటిమీద అసహ్యాన్ని కలిగిస్తారు. అప్పుడు నీవు సంతోషిస్తావు. నీతో పాటు నీ కుటుంబం. సమాజంలో మంచి పేరు కూడా వస్తుంది. చివరకు పరలోకాన్ని పొందుకొంటావు.
అట్టి కృప అందరికీ కలుగును గాక!
దైవాశీస్సులు.
0 comments