♻️ *లోతుయొక్క ఆధ్యాత్మిక లోతు* ♻️
(మొదటి భాగము)
*ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికి లోతు సొదొమ గవినియొద్ద కూర్చుండియుండెను.* (ఆది 19:1)
దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతున్నప్పుడే ఇద్దరు దేవదూతలు సొదొమవైపు పయనం సాగించి, సాయంకాలమునకు సొదొమ గవినికి చేరుకున్నారు. అక్కడ లోతు కూర్చొనియున్నాడు. నీతిమంతుడైన అబ్రాహాముతోవేరై లోతు పెద్ద తప్పుచేసాడు. లోతుయొక్క ఆధ్యాత్మిక పతనం ఒకసారి గమనించినట్లయితే?
*1. లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను* (ఆది 13:10)
లోతుకన్నులు యొర్దాను ప్రాంతమంతటిని చూచాయి. అది యెహోవాతోటవలే, ఐగుప్తువలే నీళ్లుపారే దేశముగా వుంది. అది కన్నులకు రమ్యముగా, సస్యశ్యామలంగా వుంది.
*దావీదు చూపుల్లో (బత్షెబవిషయంలో) పరిశుద్ధతను కోల్పోయాడు.*
*సమ్సోను చూపుల్లో (దెలీలా విషయంలో) పరిశుద్ధతను కోల్పోయాడు.*
*ఆకాను శపితమైన వస్తువులను చూచాడు. సొలొమోను అతని కన్నులు ఆశించినవాటిలో దేనికి చూడకుండా అభ్యంతరం చెప్పలేదట.*
*ఏదేనుతోటలో మంచిచెడ్డలు తెలివినిచ్చే ఆ పండుకూడా చూపుపలకు రమ్యముగానే కనబడింది.*
*2. తనకు యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొనెను* (ఆది 13:11):
👉 లక అందాలను చూచి మోసపోయిన లోతు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకున్నాడు. యొర్దాను ప్రాంతమంతటిని చూచాడు. లోతును పతనపు లోతుల్లోనికి దించేస్తుంది.
*ఏదేనుతోటలో మంచిచెడ్డలు తెలివినిచ్చే ఆ పండుకూడా చూపుపలకు రమ్యముగానే కనబడింది. దాని ఫలితం నేటికిని అనుభవిస్తూనే వున్నాము.*
👉 చూపులలో పరిశుద్ధతను కోల్పోతే, తలంపులలో పరిశుద్ధతను కోల్పోతాము, తలంపులలో పరిశుద్ధతను కోల్పోతే క్రియలలో పరిశుద్ధతను కోల్పోతాము. తద్వారా అదఃపాతాళానికి దిగిపోతాము. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండినయెడల నీ దేహమంతయు వెలుగు మయమైయుండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై యుండును (మత్తయి 6:22,23). కావుని ఈ రీతిగా ప్రార్ధించెదము. *“వ్యర్థమైనవాటిని చూడకుండ నా కన్నులు త్రిప్పి వేయుము నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రదికింపుము.”* (కీర్తనలు 119:37)
*3. సొదొమదగ్గర తన గుడారము వేసికొనెను* (ఆది 13:12):
సొదొమ దగ్గర గుడారం వేసుకున్నాడు. ఇంకా సొదొమలో ప్రవేశించలేదు. ఇప్పటికే అక్కడి ప్రజలు, వారి జీవిత విధానం, వారి అలవాట్లు, దైవభీతి ఇవన్నీ లోతుకు పూర్తిగా అర్ధమయ్యుంటాయి.
👉 *అక్కడనుండి ముందుకు వెళ్లకుండా వుంటే బాగుండేదేమో?* పాపము (పోతీఫరు భార్య) ఇంట్లో ఉందని, యోసేపు ఇంటబయట వున్నాడట. పాపమునకు అందనంత దూరంలోనున్నాడు. లోతు అయితే, పాపము ఏలుబడి చేసే స్థలానికి దగ్గరగా వెళ్ళాడు. మన జీవితాలు ఇట్లానే వున్నాయికదా?
*4. లోతు సొదొమలో కాపుర ముండెను* (ఆది 14:12):
లోతు లోకం లోతుల్లోనికి మరొక ముందడుగు వేసాడు. సొదొమలో ప్రవేశించాడు. బహుశా ఆ పట్టణపు స్త్రీనే వివాహము చేసుకొని, అక్కడే కాపరం మొదలుపెట్టాడు. ఇద్దరు కుమార్తెలు కలిగారు. కుమార్తెలు వివాహం చేసే వయస్సుకు వచ్చారు.
👉 *అంటే అప్పటికే సుమారు 20 సంవత్సరముల నుండి సొదొమలోనే కాపురం చేస్తున్నాడు.* అక్కడ పరిస్థితులన్నీ సంపూర్తిగా అతనికి తెలుసు. అయినప్పటికీ అక్కడ జీవించడానికే ఇష్టపడ్డాడు. అదేమీ సంతోషకరమైన జీవితం కాదు. *దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడిచేత బహు బాధపడ్డాడు.* (2 పేతురు 2:7)తన్నుతాను కాపాడుకోగలిగినా గాని, కనీసం తన కుటుంబాన్ని కూడా రక్షించుకోలేకపోయాడు.
*5. సొదొమ వారితో తన కుమార్తెలకు వివాహము నిశ్చయించెను:* (ఆది 19:14)
సొదొమ పట్టణస్థులకు దేవుని భయము లేదని, తుచ్ఛమైన, వికృతమైన లైంగిక వాంఛలు కలిగిన జనాంగము అని తెలిసికూడా, వారితోనే వియ్యమొండడానికి సిద్దపడి, కుమార్తెలకు వారితోనే వివాహాలను నిశ్చయించాడు. కాబోయే అల్లుళ్ళు మంచివారే అనుకోవడానికి లేదు. దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు, ఊరి విడచి వెల్దామన్నపుడు వాళ్ళు ఇతనికి యెగతాళి చేశారు.
*అబ్రాహాము అట్లా చెయ్యలేదు. కనానీయులతో వియ్యమొందక, తన కుమారుని కొరకు స్వజనులలోనుండి తీసుకువచ్చిన అమ్మాయితోనే వివాహం చేసాడు.*
*6. లోతు సొదొమ గవినియొద్ద కూర్చుండియుండెను.* (ఆది 19:1):
దేవదూతలు సొదొమను నాశనము చెయ్యడానికి వెళ్ళేటప్పటికి, లోతు సొదొమ గవినియొద్ద కూర్చొని వున్నాడు. గవిని యొద్ద ఎవరు కూర్చొని వుంటారంటే, న్యాయాధిపతులు, రాజకీయనాయకులు, అధికారులు, మొదలగువారు. అంటే లోతు ఆ దేశరాజకీయాల్లో కొనసాగుతున్నాడేమో తెలియదు.
అబ్రాహాము నలుగురు రాజులను జయించి, కొల్లగొట్టినవన్నీ తీసుకొచ్చి అప్పగించినందుకు, లోతుకు ముఖ్యమైన పదవి ఏదైనా సొదొమలో యిచ్చారేమో తెలియదు. *ఏదిఏమైనా లోతు లోకం లోతుల్లోనికి ప్రవేశిస్తూ చివరికి సొదొమ గవిని యొద్దకు చేరుకున్నాడు. నీ పలుకుబడి నిన్నెక్కడకి నడిపిస్తుందో ఒక్కసారి యోచన చెయ్యి.*
👉 *లోతు లోకం లోతుల్లోనికి దిగిపోతున్నాగాని, అతన విషయంలోమాత్రం నీతిని కాపాడుకున్నవానిగానే జీవించగలుగుతున్నాడు.*
దేవదూతలు ఆ పట్టణంలో ప్రవేశించగానే, అబ్రాహామువలెనే లోతుకూడా వారిని గుర్తుపట్టి ఎదుర్కొనడానికి వెళ్లి, సాష్టాంగపడ్డాడు. వారిని మిక్కిలిబలవంతం చేసి మరీ తన ఇంటికి తీసుకొనివెళ్ళాడు. అంటే లోతు ఇంట్లో పరిస్థితులు బానేవున్నాయన్నమాట. పొంగని రొట్టెలతో ఆతిధ్యమిచ్చాడు. అతిధి మర్యాదలు బానే చేసాడు. *అతిధులను రక్షించడానికి తన కుమార్తెలను సహితం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు (ఇదెంతమాత్రమూ హర్షించే విషయం కాదు). ఆతిధ్యమివ్వడానికి భార్య, కుమార్తెలుకూడా బానే సహకరించారు.*
👉 *పురుషుని కూడని ఇద్దరు కుమార్తెలు అతనికి వున్నారంటే, ఇప్పటివరకు వారి క్రమశిక్షణ బానే వున్నట్లనిపిస్తుంది. పాపపులోకంలో లోతుకుటుంబం ప్రత్యేకమైనదిగానే జీవిస్తున్నట్లనిపిస్తుంది.*
♻️ *సొదొమ పాపము* ♻️
సమృద్ధియైన ఆహారం కలిగి వుండడం వలన, విచ్చలవిడి సుఖానికి అలవాటుపడి, హృదయాలు గర్వించి, దేవుడంటే లెక్కలేకుండా వారికి నచ్చినట్లుగా జీవిస్తున్నారు. (యెహెజ్కేలు 16:49) సొదొమ మనుష్యులు దుష్టులును, యెహోవా దృష్టికి బహు పాపులునై యుండిరి (ఆది 13:13).
👉 *ఇంతకీ వారు చేసిన పాపమేమిటో? 'హోమో సెక్స్' మగవారు మగవారితో కలసి చేసే లైంగిక పాపం.*
లోతు ఇంటికి వచ్చిన మనుష్యులతో లైంగిక వాంఛ తీర్చుకునేందుకు పట్టణము నలుదిశలనుండి వచ్చారట. వచ్చినవారంతా యవ్వనులు మాత్రమేకాదు. బాలురును వృద్ధులును ప్రజలందరును నలుదిక్కులనుండి కూడివచ్చి ఆ యిల్లు చుట్టవేసిరి. (ఆది 19:4) బాలురను గద్దించేవారు ఎవ్వరూ లేరన్నమాట, తర్వాత తరాలకు ఈ పాపం విస్తృతపరచడానికి, ఈ వృద్ధులే పిల్లలను వెంటబెట్టుకొని తీసుకువచ్చారేమో? వినడానికే ఎంత అసహ్యంగా వున్నాయి వారి జీవితాలు? లోతు తన కుమార్తెలను పంపిస్తానంటే, లేదు నీ ఇంటికి వచ్చిన మనుషులే మాకు కావాలంటున్నారు.
*తుచ్ఛమైన అభిలాష, పురుషులతో పురుషులు లైంగిక వాంఛలు తీర్చుకొనే దౌర్భాగ్యస్థితిలో వారు కొనసాగుతున్నారు. లోతు ఇట్లాంటివారి మధ్యలోనే కాలం వెళ్లబుచ్చుతున్నాడుగాని, వారినుండి దూరమయ్యే ప్రయత్నం చెయ్యలేదు.*
👉 ఒకవేళ అక్కడే పుట్టిపెరిగిన తన భార్య, పిల్లలు అందుకు సమ్మతించలేదేమో? లేక అక్కడ అతనికున్న ఆస్థిని, పలుకుబడిని విడచి రాలేకపోయాడేమో? చివరకు తాను సంపాధించినదానిలో దేనిని తన వెంట తీసుకొనివెళ్లలేక పోయాడు.
👉 *ప్రియ విశ్వాసి! నీవు జీవిస్తున్న పరిస్థితులు సంఘములోగాని, సమాజములోగాని దేవునికి వ్యతిరేకమైనవని తెలిసికూడా, నీ పలుకుబడి కోసం, సంపాదనకు, నీ మనస్సాక్షిని చంపుకొని కొనసాగిస్తున్నావేమో? దాని ఫలితం అత్యంత చేదుగా వుండబోతోంది. నీవాశించినదేది నీతోరాదు. పరిశుద్ధుడైన ప్రభువుయొక్క అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన పిల్లలతో సహవాసం చేస్తూ, నిత్యమైన గమ్యమువైపు సాగిపోవుదము.*
అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
*హల్లెలూయ...*
*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*
*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
➖➖➖➖➖➖➖➖➖➖
0 comments