సీమోను పేతురు విస్తారమైన చేపలు పట్టుట:
————- 🎣 🐠 🐟 ————
జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయనమీద పడుచుండగా ఆయన గెన్నేసరెతు సరస్సుతీరమున నిలిచి, ఆ సరస్సుతీరముననున్న రెండుదోనెలను చూచెను; జాలరులు వాటిలోనుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోనెలలో సీమోనుదైన యొక దోనె యెక్కిదరినుండి కొంచెము త్రోయుమని అతని నడిగి, కూర్చుండి దోనెలోనుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోనెను లోతునకు నడిపించి, చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితివిు గాని మాకేమియు దొరకలేదు; అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోనె లోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి; వారు వచ్చి రెండు దోనెలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి, యేసు మోకాళ్లయెదుట సాగిలపడి ప్రభువా, నన్నువిడిచి పొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడనున్న వారందరును విస్మయ మొందిరి. ఆలాగున సీమోనుతో కూడ పాలివారైన జెబెదయి కుమారులగు యాకోబును యోహానును (విస్మయ మొందిరి). అందుకు యేసు భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై యుందువని సీమోనుతో చెప్పెను. వారు దోనెలను దరికిచేర్చి, సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. (లూకా 5:1-11)
Note: గెన్నేసరెతునే గలిలయ, తిబెరయ అని కూడా పిలుస్తారు.
💮 ఉపోద్ఘాతము:
చేపల వేటలో అత్యంత అనుభవజ్ఞుడైన సీమోను పేతురు రాత్రంతా కష్టపడ్డాడు. కానీ, ఒక్క చేపకూడా దొరకలేదు. అతని దోనెలో కూర్చోవడానికి ప్రభువుకు స్థానమిచ్చాడు. ఆయన మాటలు విన్నాడు. ఆయన చెప్పినట్లుగా చేసాడు. విస్తారమైన చేపలుపట్టాడు. వాటన్నింటిని విడచి ప్రభువును వెంబడించాడు.
💮 ఆత్మీయ పాఠములు:
🐠 వలలు కడుగుకొంటున్న పేతురు
ప్రభువు పని చేసేవారితో పనిచేస్తారు. సాగిపోయేవారితో సాగిపోతారు. కానీ, పనీ, పాటు లేకుండా సోమరిగా కూర్చుండేవారితో కూర్చోడాయన. మోషే మందలు మేపుతున్నప్పుడు ప్రభువు ఆయనను ఎన్నుకున్నారు ( నిర్గమ 3:1 ) గిద్యోను గానుగ చాటున గోధుమలు దుళ్లగొట్టుచుండగా ప్రభువు ఆయనను ఎన్నుకున్నారు ( న్యాయాధి 6:11 ) ఎలీషా తన పొలాన్ని దున్నుతున్నప్పుడు ప్రభువు ఆయనను ఎన్నుకున్నారు (1రాజులు 19:19) పేతురును కూడా తన వలలు కడుగుకొనుచుండగా ప్రభువు ఆయనను ఎన్నుకున్నారు. ప్రభువు నీ చేతికిచ్చిన పనిఏదైనా నమ్మకముగా చేయగలిగితే, ఆయన పనికి నిన్ను వాడుకుంటారు.
🚣♀️ తన దోనెలో ప్రభువుకు స్థానమిచ్చిన పేతురు
అప్పటికే రాత్రంతా వేటాడి అలసిపోయాడు. చేపలేమి పట్టలేకపోయాడు దానితో చెప్పలేనంత నిరుత్సాహం. అంతలో ప్రభువు వచ్చి ఆయన దోనె ఎక్కి, కొంచెంలోనికి త్రోయమంటున్నారు. ఒకవేళ అంత జనసమూహం ఆయనను వెంబడిస్తుంటే కాదనలేకపోయాడేమో? అంతటి గొప్ప వ్యక్తి తన దోనె ఎక్కడం అతనికి ఒకింత గర్వంగా అనిపించిందేమో? ఏదియేమైనా ఆయన చెప్పినట్లు చేసాడు. తన దోనెలో ప్రభువు వుండడానికి యిష్టపడ్డాడు. దోనెను లోతునకు నడిపించాడు. యిదే, పేతురు జీవితంలో అద్భుతాన్ని చూడడానికి కారణమయ్యింది. నీ జీవిత దోనెలో యేసయ్యకు స్థానముందా? అది ఆధ్యాత్మిక లోతుల్లోనికి వెళ్లగలుగుతుందా? ఆయనకు స్థానం లేకపోతే, నీ జీవితమంతా ప్రయాసే. నిరుత్సాహమే. పేతురు దోనెలో ప్రభువులేనప్పుడు, అతని ప్రయాస అంతా వ్యర్ధమయ్యింది. తన దోనెలో ప్రభువును చేర్చుకొనినప్పుడు అదొక దీవెనగా మారింది. నేడైనా ప్రభువును నీ హృదయంలో చేర్చుకోవడానికి నీవిష్టపడితే, నీ హృదయమనే తలుపునొద్దనే ఆయన నిలచియున్నాడు (ప్రకటన 3:20)
🐠 ప్రభువు మాటకు విధేయత చూపిన పేతురు
ప్రభువు పేతురు నావను తన పరిచర్యకు వాడుకున్నారు. అందుచే, దానికి అద్దె చెల్లించాలనుకున్నారేమో, దోనెను మరింత లోనికి నడిపించి వల వేయమని చెప్పారు. దానికి సమాధానముగా పేతురు, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితివిు గాని మాకేమియు దొరకలేదు; అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. (లూకా 5:5) పేతురు అంటున్నాడు. రాత్రంతా నా ప్రయత్నం నేను చేసాను. ఫలితం శూన్యం.
"అయినప్పటికీ", నీవు చెప్పినట్లే చేస్తాను. ప్రభువు మాటపై యింతటి విశ్వాసము ఎట్లా సాధ్యమయ్యింది? బహుశా, ఆ దోనెలో యేసయ్య ప్రకటిస్తున్న మాటలు, అతనిని విశ్వాసములోనికి నడిపించాయేమో? ఆ విశ్వాసమే విధేయత చూపడానికి కారణమయ్యుంటుంది. కాగా వినుట వలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును (రోమా 10:17) నిజానికి, యేసు ప్రభువు మాట పేతురు వినాల్సిన అవసరం లేదు. ఎందుకంటే? యేసు ప్రభువు వారు వడ్రంగి కుటుంబములో పెరిగారు. పేతురు మత్స్యకారుల కుటుంబములో పెరిగిన వాడు. చేపలు ఎక్కడ ఉంటాయో? పేతురుకే బాగా తెలుసు. కాని, యేసు ప్రభువు వారు సమస్తమూ ఎరిగినవాడు అని పేతురు గ్రహించగలిగాడు. ఆ గ్రహింపే విధేయతకు కారణమయ్యింది. ఆ విధేయతే (విశ్వాసమే) అద్భుతాన్ని చూడగలిగింది.
అట్టి గ్రహింపులోనికి నీవూ, నేనూ రాగలగాలి.
🐠 పేతురు విధేయత, వేరొకరికి ఆశీర్వాదం:
పేతురు, ప్రభువు మాటకు విధేయుడయ్యాడు. విస్తారమైన చేపలు పట్టాడు. ఎంత విస్తారమంటే, వల పిగిలిపోయేటంత. తన జీవితంలో మునుపెన్నడూ చూడనంత విస్తారమైన చేపలు. అతని దోనెతోపాటు ప్రక్క దోనె కూడా చేపలతో నిండిపోయింది. అవును! నిజమైన ఆశీర్వాదం అంటే ఏమిటో తెలుసా? నీవే ఒక ఆశీర్వాదముగా వుండడం. నిన్ను బట్టి వేరొకరు ఆశీర్వదించబడడం. ఈ రీతిగానే దేవుని స్నేహితుడునూ, విశ్వాసులకు తండ్రియైన అబ్రాహామును దేవుడు ఆశీర్వదించారు ( ఆది 12:2). నిన్నుబట్టి నీ బిడ్డలు, నిన్నుబట్టి నీ కుటుంబం, నిన్నుబట్టి నీ సంఘం, నిన్నుబట్టి నీ పొరుగువారు ఆశీర్వదించబడాలంటే, నీవే ఒక ఆశీర్వాదముగా వుండాలంటే, ప్రభువుమాటకు విధేయత చూపడం ఒక్కటే మార్గం.
🐠 ప్రభువును వెంబడించిన పేతురు
రాత్రంతా దేనికోసం కష్టపడ్డాడో అవి విస్తారంగా దొరికాయి. ఇప్పుడు వాటిని తీసుకొనివెళ్లి అమ్ముకోవాలి. కాని, వాటన్నింటిని విడచిపెట్టి ఆయనను వెంబడిస్తున్నాడు. కారణం? ఆశీర్వాదాలకుకర్త తనతోవుంటే? ఇక ఆశీర్వాదాలతో పనేముంది? మన జీవితాలు దీనికి విరుద్ధముగానున్నాయి కదా? ఆశీర్వాదాలంటే చెప్పలేనంత యిష్టం. ఆశీర్వాదాలకు కర్తయైన ప్రభువుకు విధేయత చూపడమంటేమాత్రం చెప్పలేనంత కష్టం. అందుకే మన జీవితాల్లో అద్భుతాలు చూడలేకపోతున్నాం. ఆశీర్వాదాలను అందుకోలేకపోతున్నాం. మనమొక ఆశీర్వాదముగా నుండలేకపోతున్నాం.
💮 ముగింపు:
నీ జీవిత దోనెలో యేసు ప్రభువుకు స్థానం లేకుండా నీ ప్రయత్నాలు నీవు చేసేసి, అలసిపోయావేమో? ఓడిపోయావేమో? నేడైనా ఆయన శక్తిని గ్రహించి, నీ హృదయంలో చేర్చుకొని, ఆయన మాటకు విధేయత చూపగలిగితే? నీవే కాదు నిన్ను బట్టి నీ కుటుంబం, నిన్నుబట్టి నీ పొరుగువారు కూడా ఆశీర్వదించబడతారు. అట్లా అని, కేవలం ఆశీర్వాదాలను స్వంతం చేసుకొనే ప్రయత్నం కాదుగాని, ఆశీర్వాదాలకుకర్త అయిన ఆయనను స్వంతం చేసుకోగలగాలి. అప్పుడు నీవే ఒక ఆశీర్వాదపునిధిగా మార్చబడతావు. ఆ నిత్య రాజ్యానికి వారసునివవుతావు. మనస్పూర్తిగా ఒక మాట చెబుదాము. ప్రభువా! నా జీవితమంతా నీవు లేకుండా, నిన్ను కాదని ప్రయాసపడ్డాను. ఏమి సాధించలేకపోయాను, సమాధానాన్ని కోల్పోయాను. ఇప్పుడు నీ చిత్తానికి నా జీవితాన్ని అప్పగిస్తున్నాను. అంగీకరించు! ఆశీర్వదించు! అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
a knockout post dildo,dildo,cheap sex toys,male masturbator,dog dildo,sex chair,dildo,wolf dildo,horse dildo his explanation