ప్రేయర్ ఆయిల్ కొరకు పరుగులు తీయొద్దు!
*మీలో ఎవడైనను రోగియై యున్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను; వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతనికొరకు ప్రార్థనచేయవలెను. విశ్వాససహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును; అతడు పాపములు చేసినవాడైతే పాపక్షమాపణ నొందును*. (యాకోబు 5:14,15)
ఒక దినాన్న వేలాదిమందిగా హాజరైన ఒక మీటింగ్ ను దాటి వెళ్తున్నాను. అటువైపు చూస్తే ఒక దృశ్యం నన్ను ఆశ్చర్య పరచింది. అదేమిటంటే కొందరు ఎండ్రిన్ క్యాన్స్ వంటివి తగిలించుకొని, ప్రజలు మధ్యలోనుండి స్ప్రే చేసుకొంటూ పోతున్నారు. అనేకులు అది వారి మీద పడకపోతే, అతనిని పిలిచి మరీ స్ప్రే చేపించుకొంటున్నారు. అదేంటో నాకర్ధం కాక, అడిగితే చెప్పారు. అయ్యగారు ప్రార్ధన చేసిన నూనె కొంచెం నీటిలో కలిపి అట్లా స్ప్రే చేస్తారని. ఆ విషయం నన్నెంతగానో బాధించింది. క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో ప్రేయర్ ఆయిల్ అనేది అనేకుల జీవితాల్లో అంతర్భాగమయ్యింది. అనేకమంది దీనిని వారి వ్యాపారంలో ఒక భాగముగా మలచుకొంటుంటే, అనేక సందర్భాలలో క్రైస్తవ్యం విమర్షింప బడడానికి ఇదొక కారణంగా మారింది. వాస్తవికతను సేవకులు చెప్పరు. విశ్వాసులు అని పిలువబడేవారు వాటిని పట్టించుకోరు. నా మాటలు కాదు గాని, పరిశుద్ధ గ్రంధం ఏమని బోధిస్తుంది?
*మీలో ఎవడైనను రోగియై యున్నాడా?*
▫️ *అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. *
👉సవస్థత వరముందంటూ నీవెక్కడికో వెళ్లడం కాదు. పెద్దలను లేదా సేవకులను నీ ఇంటికి పిలిపించాలి
▫️ *వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతనికొరకు ప్రార్థనచేయవలెను. *
👉 సంఘ పెద్దలు లేదా సేవకులు వారి చేతులతో రోగియైన వానికి నూనె వ్రాసి, ప్రార్ధించాలి. అంతేగాని ఎక్కడినుండో బాటిల్స్ తెచ్చుకొని నీవు వ్రాసుకోకూడదు.
విశ్వాససహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును.
👉నన్ను స్వస్థ పరచేది నూనె ఎంతమాత్రమూ కాదు. “విశ్వాస సహితమైన ప్రార్ధన మాత్రమే”
దేవుని వాక్యం ఇంత స్పష్టముగా తెలియజేస్తుంటే, నీవేమో బాటిల్స్ పట్టుకొని క్యూ లో నిలబడతావ్. లేకుంటే వారు అమ్మే బాటిల్స్ ను కొని తెచ్చుకుని ఇల్లంతా చల్లేస్తావ్.
ఇప్పుడేమయ్యిందో చూద్దాం! మీ గృహములో ఎవరికైనా చిన్న బలహీనత వస్తే? ఇప్పుడు మొట్టమొదటగా గుర్తొచ్చేదేమిటంటే, “ప్రేయర్ ఆయిల్”. అంటే, నీ విశ్వాసం దేవునిని విడచి ప్రేయర్ ఆయిల్ మీదకు మళ్లిందన్నమాట. దేవుని యొక్క స్థానాన్ని ప్రేయర్ ఆయిల్ తీసుకుంది. దేవుని యొక్క స్థానాన్ని ఏదైతే తీసుకుందో అది ఒక విగ్రహమవుతుంది. అంటే నీ జీవితంలో ప్రేయర్ ఆయిల్ ఒక విగ్రహం గా మారింది. దానిపైన ఆధారపడిన నీవు ఒక విగ్రహారాధికుడవుతావు. నిన్ను స్వస్థ పరచేది, నీ విశ్వాసమే గాని, ప్రేయర్ ఆయిల్ కాదనే గ్రహింపులోనికి రాగలిగితే, శోధన వచ్చినప్పుడు, ప్రేయర్ ఆయిల్ కోసం వెతుక్కోవు. నీవే దేవుని సన్నిధిలో మోకరిస్తావు. ఇదే దేవునితో నీయొక్క సహవాసాన్ని కొనసాగిస్తుంది. అపొస్తలుల బోధకు కట్టుబడి జీవిస్తున్నానని చెప్పుకొనే నీవు, అపొస్తలులు ఎవరైనా నూనె సీసాలకు ప్రార్ధించారా? వాటిని అమ్ముకున్నారా? నీ విశ్వాసం నూనె మీదకు మళ్ళిందేమో? అయితే నీవు ఆధ్యాత్మిక ప్రమాదంలోనున్నట్లే. ప్రతీ పరిస్థితియందు ప్రార్ధించుట అలవరచుకో. దేవుని స్థానాన్ని తీసుకొనే వేటియందు ఆధారపడకు.
చివరిగా ఒక్కమాట! నీ పాపములు ఒప్పుకొని, నిన్ను నీవు పరిశుద్ధపరచుకొని ప్రార్ధించగలిగితే, ఎవరో ప్రార్ధించిన నూనెతో నీకు పనే లేదు. నీ ప్రార్ధనే నీ సమస్యలనుండి విడుదల చేసి. ప్రభువుతో మిమ్ములను మరింత సన్నిహితంగా నడిపిస్తుంది. అంతేగాని, దేవునికి చెందాల్సిన మహిమను దేనికో, ఎవరికో చెందించే ప్రయత్నం చెయ్యొద్దు. అది మన ఆధ్యాత్మిక జీవితాలకు క్షేమకరం కాదు. సరి చేసుకుందాం! ప్రార్ధిద్దాం! పొందుకుందాం! అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక ! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
0 comments