ఫిలిప్పీయులకు 3:14
క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, "గురి యొద్దకే పరుగెత్తుచున్నాను".
🏵ఉపోద్ఘాతం: 2020 సంవత్సరం చివరకు వచ్చాం. ఈ సంవత్సరంలో మన ఆత్మీయ పరుగులో అనగా ఆత్మీయ జీవితంలో ఏమైనా పరిపూర్ణత సాధించామా? చాలామంది ఆత్మీయ పరుగు ఆగిపోయింది మరికొంతమంది పరుగు ఆగిపోయే పరిస్థితిలో ఉన్నది. మరి మన ఆత్మీయ పరుగు ఎలా ఉన్నది? ఆత్మీయ జీవితంలో సంపూర్ణత లోనికి ఎదిగామా లేదా అని ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన సమయం.
కొంతమంది “మేము ఆత్మీయ జీవితంలో పరిపూర్ణస్థితికి వచ్చేశాము” అని మాట్లాడుతారు. కాని ప్రియదేవుని బిడ్డలారా! గొప్ప రాయబారి పౌలుకే పరిపూర్ణత లేనప్పుడు, మనలో లేదనుకోవడానికి సంశయం ఏముంది? క్రీస్తు తనను రక్షించి పిలిచినప్పుడు తాను ఎలా ఉండాలని ఆయన కోరాడో పూర్తిగా ఆ విధంగా అయిపోవాలని పౌలు ఆశ.
క్రొత్త సంవత్సరం సిద్ధపాటు కొరకు ఏడు సూత్రాలు: (ఫిలిప్పీ 3:12-16 నుండి ధ్యానం)
🏵1. ఆధ్యాత్మిక జీవితంలో సంతృప్తి చెందామని అనుకోవద్దు: ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా సాధించవలసినది చాలా ఉంది చాలామంది విశ్వాసులు ఈ సంవత్సరం తమ క్రైస్తవ నడకతో సంతృప్తి చెందామని అనుకుంటున్నారు. ఎందుకంటే వారు ఇతర క్రైస్తవులతో తమను తాము పోల్చి చూస్తున్నారు. కాని పౌలు అయితే ప్రస్తుతం ఉన్న తన ఆధ్యాత్మిక స్థితితో సంతృప్తి చెంది ఊరుకోలేదు. గతంలో తాను సాధించినవి అతనికి సంతృప్తి కలిగించలేదు. తన జీవితంలో క్రీస్తు ఇంకా ఎక్కువగా ఉండాలని ఆశిస్తున్నాడు.
(ఫిలిప్పి 3:12 ఇదివరకే నేను గెలిచితి ననియైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని యైనను నేను అనుకొనుట లేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసుచేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరుగెత్తు చున్నాను.)
🏵2. ఇంకా సాధించాలనే ఆసక్తి యుండాలి: దేవుని విషయంలో మనలో ప్రతి ఒక్కరూ పూర్తి నిశ్చయతతో శ్రద్ధాసక్తులు చివరిదాకా చూపాలనీ పౌలు కోరిక. (హెబ్రీ 6:11-12 మీరు మందులు కాక, విశ్వాసము చేతను ఓర్పుచేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనునట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనుపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలెనని అపేక్షించు చున్నాము.)
క్రైస్తవ జీవితంలో ఇంకా అధ్బుతంగా ముందుకు సాగాలన్న యథార్థమైన బలమైన కోరిక మనలో లేకపోతే ఆత్మీయ జీవితంలో వెనుకకు జారిపోతాము. ఈ లోకంలో మన జీవితాంతం క్రీస్తులో నమ్మకం ఉంచుతూ, ఆయనకు సేవ చేస్తూ పోవడమే ప్రాముఖ్యమైన విషయం.
🏵3. వెనుకున్నవి మర్చిపోవాలి: గతంకన్నా భవిష్యత్తే ముఖ్యం కనుక వెనుకున్నవి మర్చిపోవాలి. అంటే అన్ని మరచిపోమ్మని కాదు. పౌలు తన పాత జీవితం మీద తన ఆలోచనలను ఉంచుకోలేదని దీని అర్థం. పాత జీవితం తనను వశపరచుకోకూడదని అతని ఉద్దేశం. అతనికి గతం కన్న భవిష్యత్తే ముఖ్యం. గతంలోని తన జయాపజయాలను వెనకే విడిచిపెట్టి ముందుకు సాగిపోవాలను కుంటున్నాడు.
(ఫిలిప్పి 3:13 సహోదరులారా, నేనిదివరకే పట్టుకొని యున్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను; వెనుక ఉన్నవి మరచి)
"వెనుక ఉన్న వైఫల్యాలను మర్చిపోవాలి, లేకపోతే వెనుకున్న అపజయాలు రాబోయే సంవత్సరంలో మనం సాధించబోయే విజయాలను నియంత్రిస్తాయి. గతంలోని తన జయాపజయాలను వెనకే విడిచిపెట్టి ముందుకు సాగిపోవాలను కుంటున్నాడు పౌలు.
🏵4. ఈ సంవత్సరం సాధించిన విజయాలపై గర్వం వద్దు: తన విజయాలపై సంతృప్తి చెంది గర్వించి ఏమరుపాటుగా ఉండేలా చెయ్యడానికీ పౌలు అనుమతించడం లేదు. గర్వం మన ఆత్మీయ పరుగును నిదానింపజేసి ఆపివేస్తుంది. నాశనమునకు ముందు గర్వము నడుచును (సామెతలు 16:18)
ఈ గర్వము మరియు అహంకారమైన మనస్సు మనలను నాశనమునకు తెసుకెల్తుంది. బైబిల్ చూస్తే, గోలియతు, హామాను, నెబుకద్నెజరు, బెల్షస్సరువంటి వారు వారి గర్వము బట్టి పతనానికి వెళ్లిపోయారు. గర్వము ఆత్మకు, మనసుకు, శరీరమునకు విషం మాదిరిగా ఉన్నది. ఈ గర్వము వలన మనము ఎవరిని కూడా ప్రేమించలేము. సామెతలు 29:23 " ఎవని గర్వము వానిని తగ్గించును వినయమనస్కుడు ఘనతనొందును “
🏵5. ముందున్న గురిని మర్చిపోవద్దు: పౌలు దృష్టి ఎల్లపుడు దేవుడిచ్చు బహుమతిపైనే ఉన్నట్లుగా మనం కూడా ఎన్ని సంవత్సరాలు గతించి పోతున్నా మన పరుగు ఆపకూడదు మనం పోరాటం ఆగకూడదు.
(ఫిలిప్పీయులకు3:13,14 సహోదరులారా, నేనిదివరకే పట్టుకొనియున్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను; వెనుక ఉన్నవి మరచి (లక్ష్యపెట్టక) ముందున్న వాటికొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను.
సాతాను మన దృష్టి ప్రక్కకు మరల్చడానికి చూస్తాడు. పరుగు పందెంలో పరుగెత్తే వారంతా పరుగెత్తుతారు గానీ బహుమతి లభించేది ఒకరికే అని తెలిసికొని ఆ బహుమతి మనకే లభించేలా గురివైపు పరుగెత్తాలి. క్రీడాకారుడు అన్నిటిలో తనను అదుపులో ఉంచుకొంటాడు. (1 కొరి 9:25 మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము.)
🏵6. క్రీస్తువలె ఉండుటకు క్రీస్తు స్వరూపంలోనికి ఇంకా ఎదగాలి: కొలస్సి 1:28 ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన యెదుట నిలువబెట్టవలెనని, సమస్తవిధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధిచెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు, ఆయనను ప్రకటించు చున్నాము.
మనము పరిపూర్ణతలో ఇంకా పైకి ఎదగాలి. ఎన్ని అలలు వచ్చినా, గాలికి కొట్టుకొని పోకుండా, క్రీస్తు స్వరూపమునకు ఎదగాలి. ఫిలిప్పి 1:9 మీరు శ్రేష్ఠమైన కార్యములను వివేచింపగలవారగుటకు, మీ ప్రేమ తెలివితోను, సకలవిధములైన అనుభవజ్ఞానముతోను కూడినదై, అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు,
ఈ 2019 సంవత్సరంలో మనం ఎంతో పరిపూర్ణమైన ఆత్మీయ జీవితం జీవించినా అది ఇంకా చాలదు. రాబోయే 2020 సంవత్సరంలో అంతకంతకు అభివృద్ధి పొందాలి. పౌలు అంతటివాడే తనలో పాపమేమీ లేకుండా ఒక్క తప్పు కూడా చేయకుండా ఉండే పరిపూర్ణ స్థితి తనకున్నదని అనలేదు. కానీ తానొక పరిపక్వత చెందిన విశ్వాసిననీ, క్రీస్తులో ఆధ్యాత్మికంగా ఎదిగినవాడిననీ అతనికి తెలుసు. ఇంకా పైకి పరిపూర్ణతలోనికి పౌలువలె మనం కూడా ఎదగవలసి యున్నది. ఫిలిప్పీ 3:15 కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగియుందము.
ఎఫేస్సి 4:14-15 అందువలన మనమిక మీదట పసిపిల్లలమై యుండి, మనుష్యుల మాయో పాయములచేత వంచనతోను, తప్పుమార్గమునకు లాగు కుయుక్తితోను, గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడిన ప్రతి ఉపదేశామునకు కొట్టుకొని పోవుచు అలలచే ఎగుర గొట్టబడిన వారమైనట్లుండక ప్రేమగలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు, మనమన్ని విషయములలో ఎదుగుదము.
🏵7. ఆత్మీయ పరుగులో క్రమశిక్షణ కలిగి యుండాలి: There must be discipline in our Christian lives. క్రమమైన జీవితంలో నడవమని పౌలు చెప్పుచున్నాడు. ఎన్ని ప్రేరేపణలు కలిగినా యోసేపువలె క్రమశిక్షణ గలిగి విశ్వాసులు వారికున్న జ్ఞానం మేరకు నడుచుకోవాలి. మనం అలా క్రమశిక్షణలో జీవిస్తే, దేవుడు మనకు సత్యాన్ని గురించి మరింత గ్రహింపును ఇస్తాడు.
(ఫిలిప్పి 3:16 అయినను ఇప్పటివరకు మనకు లభించిన దానినిబట్టియే క్రమముగా నడుచుకొందము. హెబ్రీ 12:9 మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై యుండిరి. వారి యందు భయభక్తులు కలిగి యుంటిమి; అట్లయితే ఆత్మలకు తండ్రియైన వానికి మరి యెక్కువగా లోబడి బ్రదుక వలెనుగదా).
క్రైస్తవ క్రమశిక్షణను మనలను సరిచేస్తుంది. మనలను సరియైన మార్గములో నడిపిస్తుంది. మనలను మార్చుకొనుటకు సహాయ పడుతుంది. (సామెతలు 13:1 తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానముగలవాడగును. అపహాసకుడు గద్దింపునకు లోబడడు.)
🏵ముగింపు: యేసుతో జీవితం మనకు సంతృప్తిగానే ఉంది గాని మన ఆత్మీయ పరుగులో ఆత్మీయ జీవితంలో సంతృప్తి అనేదే ఉండకూడదు. పౌలు కూడా ప్రస్తుతం ఉన్న తన ఆధ్యాత్మిక స్థితితో సంతృప్తి చెంది ఊరుకోలేదు. గతంలో తాను సాధించినవి అతనికి సంతృప్తి కలిగించలేదు. తన జీవితంలో క్రీస్తును గురించిన పరిపూర్ణత ఇంకా ఎక్కువగా ఉండాలని ఆశిస్తు పరుగెడుతున్నాడు.
అదే రీతిగా ఈ 2020 సంవత్సరాంతంలో ఉన్న మనం పరిశీలన చేసుకొని మన తప్పులను సరిచేసుకొని రానున్న 2021 సంవత్సరంలో మరింత ఆత్మీయంగా పరుగెత్తుటకును ఎదుగుటకును ఆత్మ దేవుడు మనకు సహాయం చేయును గాక!! ఆమెన్!!
దైవాశ్శీసులు!
- పాస్టర్ జ్యోతిరాజు వేముల ప్రిన్సిపాల్
ఇమ్మానుయేల్ బైబిల్ కాలేజి
నిడుబ్రోలు
0 comments