➖➖➖➖➖➖➖➖
మనము దేవునితో సంబంధాన్ని లేక సహవాసాన్ని రెండు విధములుగా కలిగియుండవచ్చును. మొదటిగా మనము దేవుని వాక్యము ద్వారా ఆయన నుండి వింటాము. తరువాత ఆయన వాక్యానికి స్పందిస్తాము. (వాక్యముతో ఏకీభవించి, ఆమేన్ చెబుతాము).
ప్రార్థనంటే కేవలము మన మనవులను విన్నపము చేయుట కాదు. పెళ్ళికుమార్తె పెళ్ళి కుమారునితో సహవాసము చేసినట్లు ప్రభువును ఆస్వాదిస్తూ, ప్రభువులో ఆనందిస్తూ ఆయనతో సహవాసము చేయుటయే ప్రార్థనలో ముఖ్యమైన విషయము. పెళ్ళి కుమార్తె పెళ్ళి కుమారునితో ఏవిధముగా మాట్లాడాలి అనుదానికి నియమనిబంధనలేమియు లేవు.
అయినను ఈవిధముగా ప్రార్థించుట మంచిది.
1. తండ్రియైన దేవుడు ఏమైయున్నాడో దానంతటినిబట్టి ఆయనను స్తుతించుట.
2. మనము చేసిన పాపములను మరియు ఓటములను ఒప్పుకొనుట.
3. దేవుని రాజ్యము మనలోనికి వచ్చునట్లు ప్రార్థించుట.
4. మన అవసరములన్నిటి కొరకు ప్రార్థించుట.
5. ఇతరుల కొరకు విజ్ఞాపన చేయుట
6. దేవుడు చేసిన దానంతటికీ వందనములు చెప్పుట.
7. దేవుడు చేయబోయే దానంతటి కొరకు కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుట.
''విసుకక ఎల్లప్పుడు ప్రార్థించమని'' ప్రభువైన యేసు చెప్పారు (లూకా 18:1).
చిన్నచిన్న విషయములను గురించి ప్రతిరోజు దేవునితో మాట్లాడుచూ రోజంతయు ప్రార్థనాత్మలో ఉండుట మంచి అలవాటు. అప్పుడు అది ఒక ఆచారముగా ఉండక, దేవునిని అనుభవిస్తూ, ఆయనలో ఆనందిస్తాము. దేవుడు కూడా అద్భుతముగా మన హృదయాలలో మాట్లాడును. ప్రార్థించుటలో ఇవన్నియు మొదటి పాఠములు. మనము ఈ విధముగా చేస్తూ ఉంటే ఆత్మీయముగా అభివృద్ధిని పొందుతాము. అయితే ప్రార్థన ఒక ఆచారముగా మారిపోకూడదు.
ప్రార్థన అనగా దేవునిని పీల్చుకొనుట, దేవునిని పొందుకొనుట, దేవునిని ఆశ్వాదించుట, దేవునితో నింపుకొనుట. ఊపిరి పీల్చుకొనుట కష్టముగా ఉంటే, ఏదో సమస్య ఉన్నట్లు మనకు తెలుసును. విసుగు పుట్టించేదిగానో లేక అసంతృప్తితో ఉండునట్లు చేయుటకు, దేవుడు ప్రార్థన అను వరమును ఇవ్వలేదు. కాని మనము క్రీస్తులో క్షేమాభివృద్ధి పొందేకొలది ప్రార్థన మరి ఎక్కువగా చేయవలసి యుంటుంది.
దేవుడు మన హృదయములలో పెట్టిన చిన్న చిన్న భారములకొరకు నమ్మకముగా ప్రార్థిస్తూ ఉంటే, దేవుడు మరిఎక్కువగా ఆయన భారములను ఇస్తాడు. ఆ విధముగా ఇతరులను ఆశీర్వదించే ఆయన పనిలో, మనము కూడా ఆయనకు సహపనివారమవుదుము. ప్రభువైన యేసు కన్నీటితోను, మహారోధనతోను ప్రార్థించారు (హెబ్రీ 5:7). ఒకసారి ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థించినప్పుడు ఆయన చెమట రక్తపు బిందువులవలే కారింది (లూకా 22:44). ఆయన ప్రార్థన అంత తీవ్రముగా ఉండెను.
ఒకసారి ఆయన రాత్రంతయు ప్రార్థనలో గడిపారు (లూకా 6:12). అప్పుడప్పుడు అరణ్యములోకి వెళ్ళి ప్రార్థించే అలవాటు ఆయనకున్నది (లూకా 5:16). ఒకరు చెప్పినట్లు, యాత్రికులు క్రొత్త స్థలాలు చూచుటకు ఆసక్తి కలిగినట్లే ఆయన ఎక్కడకు వెళ్లినను ప్రార్థించుటకు అనుకూలమైన స్థలము కొరకు చూచేవారు. ఆయనకే ప్రార్థన అంత అవసరమైతే నీకు మరియు నాకు ఇంకెంత అవసరమో గదా! కాబట్టి సోమరితనానికి వ్యతిరేకముగా పోరాడి, ఎట్టి పరిస్థితులలోనైనను ప్రార్థించుటకు తీర్మానించుకుందాము. - జాక్ పూనెన్
0 comments