- Praveen Kumar G
- Bible Study
- Sajeeva Vahini Vol 2 Issue 2
గ్రంథ కర్త: మలాకి 1:1 ప్రకారం మలాకీ ప్రవక్త అని వ్రాయబడియుంది.
రచించిన తేదీ: క్రీ.పూ. 440 మరియు 400||సం మధ్య రచించి ఉండవచ్చు.
అధ్యాయాలు : 4, వచనములు : 55
రచించిన ఉద్దేశం: దేవుడు తన ప్రజల పట్ల ఎటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడో దానిని ముందుగానే ప్రవక్త యైన మలాకీ ద్వారా తెలియజేసినదే ఈ గ్రంథ విశిష్టత. మలాకీ 1:1 ప్రకారం “ఇశ్రాయేలీయులనుగూర్చి మలాకీద్వారా పలుకబడిన యెహోవా వాక్కు”. పాపము ద్వారా దేవునికి దూరస్తులైన తన ప్రజలు, ఆయన వైపు మరలుకొనవలెనని మలాకీ ద్వారా హెచ్చరిక ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ గ్రంథం పాత నిబంధన కాలానికి ఆఖరి గ్రంథంగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. తాను స్థాపించబోయే ధర్మ స్థాపన నిమిత్తం, వారికి వాగ్దానమిచ్చిన రీతిగా రాబోయే మెస్సీయ ద్వారా కలుగు విడుదల విమోచనను ఇశ్రాయేలీయులకు తెలియజేసాడు మలాకీ. మారుమనస్సు పొందుమని పాత నిబంధన కాలానికి తెలియజేసిన ప్రవక్త ఈ మలాకీ. తరువాత నిశబ్ధ కాలం నాలుగు వందల సంవత్సరాల తరువాత నూతన నిబంధన కాలంలో మరలా బాప్తీస్మమిచ్చు యోహాను ద్వారా మత్తయి 3:2 “పరలోకరాజ్యము సమీపించియున్నది, మారుమనస్సు పొందుడని.. ప్రకటించెను”.
మూల వాక్యాలు: 1:6 “కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా, దాసుడు తన యజమానుని ఘనపరచును గదా; నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయెను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడెక్కడ ఉన్నాడు? అని సైన్యముల కధిపతియగు యెహోవా మిమ్మునడుగగా” 3:6,7 “యెహోవానైన నేను మార్పులేనివాడను గనుక యాకోబు సంతతివారైన మీరు లయము కాలేదు. మీ పితరులనాటనుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి; అయితే మీరు నాతట్టు తిరిగిన యెడల నేను మీతట్టు తిరుగుదునవి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవియ్యగా-మేము దేనివిషయములో తిరుగుదుమని మీరందురు.”
ఉపోద్ఘాతం: పాపము ద్వారా దేవుని నుండి దూరమైన ప్రజలను ఉద్దేశిస్తూ రచించిన ఈ గ్రంథం, వారికే కాకుండా యాజకులు కూడా తమ యాజక ధర్మం నుండి దేవునికి దూరస్తులయ్యారు. దేవునికి అర్పించవలసిన వాటిలో సరియైన క్రమ పద్ధతులను పాటించుటలో విఫలమయ్యారు. అయోగ్యమైన వాటిని బలిగా అర్పించి దేవునికి మాహా కోపము పుట్టించారు. వాటిని అర్పించడమే కాకుండా యుదయా వారు దేవుడు ఎందుకు తమ అర్పణలను అంగీకరించుటలేదు అని వాదించడం, సణగడం మొదలుపెట్టారు. ఇట్లు దేవునికి దూరస్తులై, కోపము పుట్టించిన వారై, దేవునికి ఇవ్వవలసిన భాగాన్నే దొంగిలించారి. దేవునికి దూరస్తులైన ప్రజల పాపములను క్షమించగల మహా కృపగల దేవుని ప్రేమను వారికి తెలియజేసాడు మలాకీ. తమ పాపములను విడచి మారుమనస్సు పొందుమని వివరించాడు. దేవుని యొక్క కరుణా వాత్సల్యత తాను ఏర్పరచుకొన్న ప్రజలపై ఎట్టిదో తెలియజేసి, వాగ్దానం చేసిన రీతిగా ఆ వాగ్ధానాన్ని నేరేవేర్చుటకు రాబోయే మెస్సీయను గూర్చి తెలియజేసాడు మలాకీ ప్రవక్త.
మలాకీ ప్రవచించినది బాప్తీస్మమిచ్చు యోహాను ప్రకటనను ఆధారం చేసుకొనునది. అనగా దేవుని నుండి పంపబడిన మనుష్యుడైన బాప్తీస్మమిచ్చు యోహాను (మత్తయి 11:10) మెస్సీయా కొరకు త్రోవను సరాళము చేసాడు అంతే కాకుండా మారుమనస్సు పొంది ఆయన నామంలో బాప్తీస్మము పొందుమని తెలియజేసాడు.
సారాంశం: అజ్ఞాతిక్రమమే పాపం. దేవుని ఆజ్ఞలను గైకొనకుండా ఆయనకు దూరస్తులైన వారు, క్షమాపణా జీవితం కలిగి యుంటే ఆయన దరికి చేర్చి, వారిని ఆయన క్షమించేవాడుగా ఉంటాడు. మలాకీ 2:16 ప్రకారం “పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ” అని వ్రాయబడిన రీతిగా వివాహబంధం విషయంలో దేవుని ఉద్దేశం ఎంత ఖచ్చితంగా ఉందో మనకు అర్ధమవుతుంది. భార్యా భర్తల మధ్య ఏర్పడు సన్నిహిత్యాన్ని జీవితకాలం కాపాడుకోవాలి. దేవుడు పైరూపాన్ని చూడడు గాని ఆయన మన అంతరంగమును లక్షపెట్టేవాడు, మన ఆలోచనలు కూడా ఎరిగినవాడు, ఏవియు దాగలేవు. న్యాయాధిపతిగా ఆయన వచ్చినప్పుడు అన్యాయస్తులముగా ఉండకుడా ఆయన తట్టు తిరిగితే ఆయన మన తట్టు తిరిగేవాడుగా ఉంటున్నాడు. కరుణా సంపన్నుడైన దేవుడు ఆట్టి వాత్సల్యతను మనపై కుమ్మరించును గాక. ఆమేన్.
0 comments