Sunday, March 22, 2020

దేవుడు అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు

🌹 దేవుడు అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు🌹
          
           " ఆ దినములయందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించియున్నది.మారుమనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను". ( మత్తయి 3:1,2 )

            దేవుని రాజ్యములో పాపానికి, అవినీతికి, మరణ భయానికి స్థలమే లేదు.

 దేవుని రాజ్యము నీకు సమీపించియున్నది. ఎందుకంటే ప్రభువైన యేసు దానిని సమీపానికి తెచ్చాడు.

 కనుక నీ హృదయములో పాపము దాచినంత వరకు సాతానుకు అక్కడ అధికారముంటుంది. మరియు మరణ భయము కూడ ఉంటుంది.

 కొంతకాలమైన తరువాత యేసు ఇలా  బోధించాడు. "ఇదిగో ఇక్కడనని, అదిగో అక్కడనని చెప్ప వీలుపడదని వారికి ఉత్తరమిచ్చెను. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము  మీ మధ్యనే ఉన్నది". (లూకా 17:21.)

దేవుని రాజ్యములో ప్రవేశించడానికి మొట్టమొదట పశ్చాతాపముతో పాపములొప్పుకొనుట అను సిద్దపాటు ఉండాలి. అప్పుడే ఈ రాజ్యము మీ మధ్యకు వస్తుంది.

     "యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరచియున్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు". ( కీర్తనలు 103:19 ) ఈ లోక రాజ్యాలున్నాయి. అయితే ఈ రాజ్యము అన్నిటి మీద రాజ్య పరిపాలన చేస్తుంది. అంటే అర్ధమేమిటి?

 తాను చేసిన విగ్రహమునకు మ్రొక్కమని నెబుకద్నెజరు ఆజ్ఞ జారీ చేశాడు. అయితే దేవుని రాజ్య సంబంధులు అక్కడ ఉన్నారు గనుక ఆ ఆజ్ఞ మార్చవలసి వచ్చింది. ఎస్తేరు కాలములో కూడ రాజాజ్ఞ మార్చబడింది. ఫరో కూడ అనేకసార్లు తన ఆజ్ఞలను మార్చవలసి వచ్చింది.

 సింహపు బోనులో దానియేలు త్రోయబడినప్పుడు మాదీయులయొక్కయు, పారసీకుల యొక్కయు చట్టాలను మార్చకూడదని ఆ అధిపతులు బ్రతిమిలాడారు. అయితే దానియేలుకు ఏ హానియు కలుగనందువలన ఆ రాజు దానియేలు దేవునినే ప్రజలంతా పూజించాలని క్రొత్త ఆజ్ఞ ఒకటి ఇచ్చాడు. మొదటి ఆజ్ఞకు ఇది పూర్తిగా వ్యతిరేకమైనది.

        ఆయన రాజ్యము అన్నిటి మీద రాజ్యపరిపాలన చేయును. ఆయన చట్టాలు శాశ్వతంగా నియమింపబడినవి.

అతడు సహనపరుడు. అనుమానము లేదు. కాని తెలిసి, తెలిసి దానిని ఆసరాగా తీసుకొని దేవుని చట్టానికి వ్యతిరేకముగా వెళ్తే నీ దేహములోకి రోగం, నీ మనస్సులో బలహీనత, నీ ఆత్మలో దేవునికి వ్యతిరేకముగా శత్రుత్వాన్ని నాటుతున్నావన్నమాట.

 ఒక రోజున నీవు దేవునికి లోబడాలనుకుంటే అది ఎంతో కష్టమనిపిస్తుంది.

 "ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమునాయెను". ఆయన యుగయుగముల వరకు ఏలుననెను. ( ప్రకటన 11:15 ) రాజ్యములన్నియు ఆయన రాజ్యముగా అయినప్పుడు పరిశుద్ధులు పరిపాలన చేయుదురు.

        ~ యన్. దానియేలు

No comments:

Post a Comment