✝️ *దేహమే దేవుని ఆలయం*💒
_(1కొరి 6:19 మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా?)_
✳️ *ఉపోద్ఘాతము:* దేవుని ఆరాధనకు, స్తుతికి నీ శరీరం అనే ఆలయం ప్రత్యేకించ బడింది. ఒక విశ్వాసికి తన శరీరం తన స్వంతమైనట్టు దాన్ని ఉపయోగించే హక్కు లేదు. క్రీస్తులో విశ్వాసులకున్న స్వేచ్ఛకు ఇది స్పష్టమైన నిర్బంధం. తమలో నివసించే దేవుని ఆత్మకు ఆనందం, ఘనత కలిగించే పనులే వారు చెయ్యాలి. (1 కొరి 3:16 మీరు దేవుని ఆలయమై యున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించు చున్నాడనియు మీరెరుగరా?)
దీని గురించి కొన్ని విషయాలు పరిశీలన చేద్దాం.
✳️ *1. నీ దేహమే దేవుడు సంచరించు దేవాలయం:* (1కొరి 6:19 మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా?)
నీ శరీరం దేవాలయం అయినప్పుడు అది నీకు చెందినది కాదు గదా! అది దేవునికి చెందుతుంది. కొన్ని కోట్ల రూపాయలతో మందిరాలు కట్టినా, దేవుడు వాటిలో నివసించుటకు ఇష్టపడడం లేదుగాని మన శరీరంలో మన హృదయంలో నివసించుటకు ఇష్టపడుచున్నాడు. ఇదే సత్యాన్ని సోలోమోను మహారాజు గ్రహించాడు. ఎంతో ఖరీదైన మందిరం సోలోమోను కట్టించినా అది దేవుని పట్టజాలవని గ్రహించాడు. (2దిన 6:18 మనుష్యులతో కలిసి దేవుడు భూమియందు నివాసము చేయునా? ఆకాశ మును మహాకాశమును నిన్ను పట్టచాలవే; నేను కట్టిన యీ మందిరము నిన్ను పట్టునా?)
అటువంటి మహోన్నతుడైన దేవుడు నివసించుటకు సరిగ్గా సరిపోయే సరైన దేవాలయం మన శరీరమే. హల్లెలూయా!
దేవుని ఆత్మ నివసించు నీ శరీరమనే ఆలయాన్ని నీవు పాడు చేస్తే, దేవుడు సహించగలడా? (1కొరి 3:17 ఎవడైనను దేవుని ఆలయమును పాడుచేసిన యెడల దేవుడు వానిని పాడుచేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై యున్నది; మీరు ఆ ఆలయమై యున్నారు.)
దేవునికి ఆలయమైన మన శరీరాన్ని మనం పాడు చేస్తే, దేవుని ఉగ్రత మన మీదకు ఖచ్చితంగా రాగలదు. దేవుడు కోరుకునేది పవిత్రమైన ఆలయాన్ని. అది మందిరమైనా లేదా మన శరీరమనే ఆలయమైనా.
నీ ఇంటికి ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి వస్తే నీ ఇంటిని నీవు ఎంతో శుభ్రంగా ఉంచుకుంటావు. మరి అటువంటిది పరిశుద్ధాత్మ దేవుడే నీ శరీరంలో నివసించడానికి వచ్చినప్పుడు మరి ఇంకెంత జాగ్రత్తగా మన శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచాలో ఆలోచించండి.
✳️ *2. నీ ఆలయంలో సరైన ఆరాధన జరిగితే నీవు ఆత్మచేత బలపరచ బడగలవు:* ఎవరి శరీరంమనే ఆలయంలో సరైన ఆరాధన జరుగుచున్నదో అప్పుడు వారికి పరిశుద్దాత్మునికి చక్కటి అవినాభావసంబంధం ఉండగలదు. అప్పుడు ఆత్మవలన మీరు బలపరచబడగలరు. (ఎఫేస్సి 3:15 మీరు అంతరంగ పురుషునియందు శక్తికలిగి ఆయన ఆత్మ వలన *బలపరచబడునట్లుగాను.*)
✳️ *3. నీ శరీరమనే ఆలయంలో సరైన ఆరాధన జరిగితే దేవుని ఆత్మనిన్ను జీవింపజేయును:* ఒక విశ్వాసి శరీరం అతని ఆత్మ జీవించే ఇల్లు మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ నివసించు స్థలం.
ఆత్మ దేవుని ముందు మనలను మనము వెల్లడి చేసుకునే అతి ప్రాముఖ్యమైన సాధనం మన శరీరం. ఆవిధంగా మనం శరీరం దేవునికి ఆలయంగా ఉండినప్పుడు మన శరీరం చివరికి మరణం నుంచి *సజీవంగా* లేచి క్రీస్తు దేహం లాగా దివ్య శరీరం అవుతుంది (ఫిలిప్పీ 3:21సమస్తమును తనకు లోపరచుకొనజాలిన శక్తినిబట్టి ఆయన మన దీనశరీరమును తన మహిమగల శరీరమునకు సమ రూపము గలదానిగా మార్చును.) లేకపోతే అగ్ని ఆరదు శరీరం చావదు.
✳️ *4. నీ శరీరమనే ఆలయంలో సరైన ఆరాధన జరిగినప్పుడే నీవు దేవుని దత్తపుత్రుడవు కాగలవు:* క్రైస్తవుని జీవితంలో ఆత్మ ఉనికి యొక్క విశిష్టత ఏమిటంటే, నీ హృదయంలో ఆయనకు ఆరాధన సరిగా జరగాలని దేవుడే యేసు యొక్క ఆత్మను మనం హృదయంలోనికి పంపెను.
(గల 4:5-7 మనము దత్త పుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి యున్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను మరియు మీరు కుమారులై యున్నందున నాయనా తండ్రీ, అని మొఱ్ఱపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయముల లోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడవే. కుమారుడవైతే దేవునిద్వారా వారసుడవు.)
✳️ *5. దేవునికి సమర్పించబడిన శరీరమనే ఆలయంలో ప్రార్ధన ఖచితంగా జరగాలి:* మరి నీ శరీరమనే ఆలయంలో ప్రార్ధన జరుగుచున్నదా? దేవుని మందిరానికి మరియొక పేరు ప్రార్ధనా మందిరం. ఆలయంలో ప్రార్ధన జరగనప్పుడు అది దేవునికి మందిరం ఎలా అవుతుంది? (మత్తయి 21:13 నా మందిరము ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడియున్నది)
చాలా విచారించదగిన విషయమేమంటే, చాలామంది శరీరమనే ఆలయాలలో ప్రార్ధన అనేది అసలు జరగడమే లేదు. ఏ ఆలయంలో అయితే ప్రార్ధన జరుగుతుందో దేవుని దృష్టి రాత్రిం బగళ్లు ఆ ఆలయంపై ఉండగలదు. (2దిన 6:19-20 దేవా యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థన యందును విన్నపమునందును లక్ష్యముంచి, నీ సేవకుడనైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొఱ్ఱను ఆలకించుము. నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయు విన్నపములను వినుటకైనా నామమును అచ్చట ఉంచెదనని నీవు సెలవిచ్చిన స్థలముననున్న యీ మందిరము మీద నీ కనుదృష్టి రాత్రిం బగళ్లు నిలుచునుగాక.)
0 comments